Begin typing your search above and press return to search.

టీటీడీ వివాదంపై సీబీఐ విచార‌ణ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   3 July 2018 10:29 AM GMT
టీటీడీ వివాదంపై  సీబీఐ విచార‌ణ త‌ప్ప‌దా?
X
తిరుమ‌ల వెంక‌న్న‌కు విశ్వ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు విరాళంగా ఇచ్చిన న‌గ‌ల విష‌యం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కే తెర లేపింది. అస‌లు వెంక‌న్న‌కు సంబంధించిన న‌గ‌ల్లో చాలా న‌గ‌లు మాయ‌మైపోయాయ‌ని - ఈ న‌గ‌ల‌ను గుట్టుచ‌ప్పుడు కాకుండా దేశం దాటించేసిన కొంద‌రు వ్య‌క్తులు వాటిని అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నార‌ని టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కుడిగా కొన‌సాగి ఇటీవ‌లే ఆ ప‌ద‌వి నుంచి తొల‌గింప‌బ‌డ్డ ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాకుండా శ్రీ‌వారి పోటులో గుప్త నిధులు ఉన్నాయ‌ని - వాటిని త‌వ్వి తీసేందుకు కూడా య‌త్నాలు జ‌రిగాయ‌ని - ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఉన్న పోటు నుంచి శ్రీ‌వారి ప్ర‌సాదాల త‌యారీ మ‌రో ప్రాంతానికి త‌ర‌లింద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల్లో అత్యంత విలువైన‌దిగా భావిస్తున్న రూబీ డైమండ్‌ను కూడా విదేశాల‌కు త‌ర‌లించేశారని - ఇప్పుడా డైమండ్ విదేశీయుల ఆధీనంలో ఉంద‌ని కూడా ఆయన ఆరోపించారు. దీక్షితులు ఆరోప‌ణ‌ల‌కు తొలుత షాక్ తిన్న చంద్ర‌బాబు స‌ర్కారు... ఆ త‌ర్వాత దీక్షితులుపైనే ఎదురు దాడికి దిగింది.

దీక్షితులు ఆరోప‌ణ‌ల్లో నిజ‌ముంద‌న్న కోణంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మ‌రో సంచ‌ల‌న కామెంట్ చేశారు. వెంక‌న్న న‌గ‌ల మాయం గురించి త‌న‌కు కూడా కొంత‌మేర స‌మాచారం ఉంద‌ని - ఈ విష‌యంలో ఓ ఐపీఎస్ అధికారి త‌న‌కు కొంత‌మేర స‌మాచారం ఇచ్చార‌ని - అయితే పూర్తి స‌మాచారం త‌న‌కు తెలియ‌రాలేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ర‌మ‌ణ దీక్షితులు ఆరోప‌ణ‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని చంద్ర‌బాబు స‌ర్కారు... ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రంగంలోకి దిగేయ‌డంతో దిగిరాక త‌ప్ప‌లేదు. అయితే ఈ దిగిరావ‌డంలో బాబు స‌ర్కారు త‌న‌దైన మార్కు మాంత్రాంగాన్ని న‌డిపింది. శ్రీ‌వారి ఆభ‌ర‌ణాలు భ‌ద్రంగానే ఉన్నాయ‌ని - వాటిని ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టేందుకు కూడా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని ప్ర‌క‌టించిన స‌ర్కారు... తీరా న‌గ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు తాను నియ‌మించిన టీటీడీ పాల‌క‌మండ‌లి స‌భ్యుల‌తో మాత్ర‌మే అనుమ‌తించింది. ఎందుక‌లా అంటే... శ్రీ‌వారి న‌గల ప్ర‌ద‌ర్శ‌నే ధ‌ర్మ విరుద్ధ‌మ‌ని - ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో న‌గ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు త‌లూప‌క త‌ప్ప‌లేద‌ని కూడా త‌న‌దైన వాద‌న‌ను చెప్పింది. న‌గ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు స‌రేన‌న్న ప్ర‌భుత్వం... టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌డంలో అస‌లు మ‌త‌ల‌బు ఉంద‌న్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది.

స‌రే... ఇదంతా తెలిసిన విష‌య‌మే అయినప్ప‌టికీ... ఇప్పుడు బాబు స‌ర్కారు పెను ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అస‌లేమైంద‌న్న విష‌యానికి వ‌స్తే... తిరుమ‌ల వెంక‌న్న ఆభ‌ర‌ణాల మాయం - టీటీడీ ఆదాయ వ్య‌యాలు - గుప్త నిధుల కోసం జ‌రిగాయంటున్న తవ్వ‌కాల‌కు సంబంధించి వాస్త‌వాల‌ను నిగ్గు తేల్చాలంటూ గుజరాత్‌కు చెందిన భూపేందర్‌ గోస్వామి - గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌ కుమార్‌ అనే ఇద్దరు భక్తులు గతంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌పై కాసేప‌టి క్రితం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ధ‌ర్మాస‌నం... సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ను తీసుకుంది. పిటిష‌న‌ర్లు ఆరోపిస్తున్న విష‌యాల‌పై మీ స్పంద‌న తెలియ‌జేయాలంటూ టీటీడీ ఈవోతో పాటుగా ఏపీ దేవాదాయ శాఖ‌కు నోటీసులు జారీ చేసింది. కౌంట‌ర్లు దాఖ‌లు చేసేందుకు ఆ రెండింటికి మూడు వారాల‌ను కేటాయించిన హైకోర్టు... విచార‌ణ‌ను వాయిదా వేసింది.

మొత్తంగా పిటిష‌ర్లు కోరుతున్న‌ట్లుగా సీబీఐ విచార‌ణ‌కు కోర్టు ఆదేశించినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. టీటీడీ ఈఓగాని - రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి సంతృప్తిక‌ర రీతిలో కౌంట‌ర్ పిటిష‌న్లు లేక‌పోతే... ఈ వివాదంపై కోర్టు సీబీఐ విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేసే అవ‌కాశాలున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. అంతేకాకుండా మొన్న శ్రీ‌వారి న‌గ‌ల ప్ర‌ద‌ర్శ‌న అంటూ చంద్ర‌బాబు స‌ర్కారు చేసిన నానా హంగామా - సొంత మ‌నుషుల‌ను మాత్ర‌మే లోప‌ల‌కు అనుమ‌తించి - అంతా స‌వ్యంగా ఉంద‌ని చెప్పించిన వైనం కోర్టు దృష్టికి వ‌స్తే... సీబీఐ విచార‌ణ‌కు త‌ప్ప‌క ఆదేశాలు జారీ అవుతాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?