Begin typing your search above and press return to search.

టీటీడీ పాలకమండలి ఫైనల్ లిస్ట్

By:  Tupaki Desk   |   16 Sep 2021 5:33 AM GMT
టీటీడీ పాలకమండలి ఫైనల్ లిస్ట్
X
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామకం పూర్తైంది. 25 మందితో కూడిన నూతన జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తో చర్చించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కసరత్తు అనంతరం పాలకమండలి సభ్యులను ఎంపిక చేశారు. పాలకమండలిలో చోటు కోసం వందకు పైగా సిఫార్సులు వచ్చినట్లు తెలుస్తోంది. వడపోతల అనంతరం సభ్యుల జాబితాకు తుదిరూపు ఇచ్చారు.

ఇందులో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమబెంగాల్ కు చెందిన వారికి చోటు కల్పించింది. పాలక మండలిలో 25 మందికి చోటు కల్పించిన ప్రభుత్వం.. 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా 75మందితో టీటీడీ పాలకమండలి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక 25 మందితో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు.

పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండోవసారి సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్‌యన్ ల్యాబ్స్ జీవన్‌రెడ్డి, కోల్‌కతాకు చెందిన సౌరభ్ పాలకమండలిలో చోటు దక్కించుకున్నారు. మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్‍కు అవకాశం కల్పించారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలక మండలి టీటీడీ చరిత్రలో 52వది.పాలకమండలి నియామకంపై ప్రభుత్వానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సిఫార్సులు వచ్చినట్లు సమాచారం. వీరే కాకుండా సీఎం జగన్ కేబినెట్లో ఉన్న మంత్రుల బంధువులు, వైసీపీ కీలక నేతలు, సీఎం మిత్రులు, బడా పారిశ్రామిక వేత్తల నుంచి సిఫార్సులు వచ్చినట్లు తెలుస్తోంది.