Begin typing your search above and press return to search.

శ్రీవారి దర్శనం లేకున్నా..లడ్డూ ప్రసాదం కోసం భారీ క్యూ!

By:  Tupaki Desk   |   17 May 2020 5:50 AM GMT
శ్రీవారి దర్శనం లేకున్నా..లడ్డూ ప్రసాదం కోసం భారీ క్యూ!
X
లాక్ డౌన్ వేళ.. తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకోలేని దుస్థితి. దాదాపు ఎనిమిది వారాలకు పైనే స్వామి వారి దర్శనం భక్తులకు లేకుండా పోయింది. రానున్న రోజుల్లో ఎప్పటికి దర్శన భాగ్యం కలుగుతుందన్న దానిపై క్లారిటీ రాని పరిస్థితి. పరిమిత సంఖ్యలో స్వామివారి దర్శనాన్ని కల్పించాలన్న ఆలోచనలో టీటీడీ ఉన్నా.. ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇదిలా ఉంటే.. టీటీడీ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. స్వామి వారి దర్శనం లేని భక్తులకు.. కనీసం ప్రసాదాల్ని అయినా అందుబాటులో ఉంచాలని భావించింది. ఇందులో భాగంగా స్వామి వారి ప్రసాదాలైన కల్యాణం లడ్డూ.. వడలు.. చిన్న లడ్డూల్ని అమ్మకానికి పెట్టారు.

ఇందుకోసం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న ప్లే గ్రౌండ్ లో తెల్లవారుజామున అమ్మకాలకు పెట్టారు. ఈ విషయం గురించి తెలిసిన ప్రజలు.. పెద్ద ఎత్తున స్వామివారి ప్రసాదాల్ని సొంతం చేసుకోవటానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మకాలు పెట్టినా.. స్వామి వారి ప్రసాదాలు తక్కువ సమయంలో అమ్మడైనట్లుగా చెబుతున్నారు.

రానున్న రోజుల్లో ఇదే రీతిలో ప్రసాదాల్ని అమ్మే అవకాశం ఉందంటున్నారు. తాజాగా 500 కల్యాణం లడ్డూలు.. 500 వడలు.. 200 చిన్న లడ్డూల్ని అమ్మారు. తాజాగా వచ్చిన డిమాండ్ తో ఈసారి మరింత భారీగా అమ్మకాలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు. స్వామివారి దర్శనం లేకున్నా.. చివరకు ప్రసాదంతోనైనా సరిపెట్టుకున్నామన్న ఆనందం భక్తుల్లో కనిపించింది.