Begin typing your search above and press return to search.

7 కొండలు.. 7 అగరబత్తులు.. టీటీడీ వారి వినూత్న ఆలోచన అదిరిందిగా!

By:  Tupaki Desk   |   8 Sep 2021 3:55 AM GMT
7 కొండలు.. 7 అగరబత్తులు.. టీటీడీ వారి వినూత్న ఆలోచన అదిరిందిగా!
X
ఉత్తినే పారేసే పువ్వులతో 7 రకాల అగరబత్తుల్ని తయారు చేస్తే? అవి కూడా శ్రీవారికి వినియోగించిన పువ్వులతో? ఆలోచనే వినూత్నంగా ఉంది కదా? సరిగ్గా ఇదే పనిని కొంతకాలం క్రితం మొదలు పెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఈ నెల 13 నుంచి స్వామివారికి వినియోగించిన పువ్వులతో తయారు చేసిన అగరబత్తుల్ని మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన వివరాలు తెలిసినంతనే.. ఈ అగరబత్తులు కొనాలని డిసైడ్ కావటం ఖాయం. తిరుమల ఏడు కొండలకు ప్రతీకగా.. ఏడు బ్రాండ్లతో తయారవుతున్న అగరబత్తుల కథేమిటి? అసలీ ఆలోచన ఎలా వచ్చింది? అన్న వివరాల్లోకి వెళితే..

తిరుమలలో స్వామి వారికి పెద్ద ఎత్తున పువ్వుల్ని వినియోగిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా పెద్ద ఎత్తున తీసుకొస్తారు. స్వామి వారితో పాటు.. దేవాలయానికి పుష్పాలతో అలంకరణ చేస్తారు. ఏ రోజుకు ఆ రోజు కొత్త పువ్వుల్ని తీసుకొచ్చి.. పాతవాటిని పడేస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ వినూత్న ఆలోచన చేసింది. వాడి పారేసే పువ్వులతో.. అగరబత్తులు తయారు చేస్తే అనే ఆలోచనకు బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ తుది రూపు ఇచ్చింది. లాభంతో సంబంధం లేకుండా.. స్వామి వారికి వినియోగించిన పువ్వులతో అగరబత్తులు చేసేందుకు సిద్ధమని చెప్పింది.

ఇందుకుగాను ఎస్వీ గోశాలలో అగరబత్తులతయారీకి అవసరమైన స్థలాన్ని టీటీడీ కేటాయిస్తే.. దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ తమ సొంత ఖర్చుతో యంత్రాల్ని.. సిబ్బందిని నియమించి..కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా అగరబత్తుల ఉత్పత్తిని ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు.. స్థానిక ఆలయాల్లోనూ వినియోగించే పువ్వుల్ని.. తర్వాతి రోజు గోశాలకు తరలిస్తారు. వీటిని ఏ పువ్వులకు ఆ పువ్వులుగా అక్కడి సిబ్బంది వేరు చేస్తారు. అనంతరం వాటిని డ్రైయింట్ మిషన్ లో పూర్తిగా ఎండేలా చేసి.. అనంతరం పిండిని చేస్తారు. తర్వాత మూడు దశల్లో ప్రాసెస్ చేసి.. అగరబత్తుల్ని తయారు చేస్తారు.

ఇలా రోజుకు పది మెషిన్లతో రోజుకు 3.50లక్షల అగరబత్తుల్ని తయారు చేసేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని గుర్తు చేసేలా ఏడు కొండలకు ప్రతీకగా ఏడు అగరబత్తుల బ్రాండ్లను తెర మీదకు తీసుకొచ్చారు. వీటిని ఈ నెల 13న మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మరి ధర మాటేమిటి? అన్నది చూస్తే.. 100 గ్రాముల అగరబత్తులు రూ.66 ఎమ్మార్పీతో తయారు చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఈ ఏడు బ్రాండ్ల పేర్లను చూస్తే..

1. అభయహస్త
2. తందనాన
3. దివ్యపాద
4. అకృష్టి
5. సృష్టి
6. తుష్టి
7. దృష్టి