Begin typing your search above and press return to search.

రఘురామరాజు నిరూపిస్తే రాజీనామా చేస్తాను- ధర్మారెడ్డి

By:  Tupaki Desk   |   8 Jun 2021 9:30 AM GMT
రఘురామరాజు నిరూపిస్తే రాజీనామా చేస్తాను- ధర్మారెడ్డి
X
తిరుమల తిరుపతి దేవస్ధానం జేఈఓ ధర్మారెడ్డి చాలెంజ్ కు వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణరాజు స్పందించాల్సిన అవసరం వచ్చింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న తనను తొందరగా డిస్చార్జి చేయించేందుకు ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీరెడ్డితో కలిసి టీటీడీ జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి కుట్ర చేసినట్లు ఎంపి ఆరోపించారు.

ఆరోపణలు చేయటమేకాకుండా రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు రాసిన లేఖలో తన దగ్గర ఆధారాలున్నట్లు చెప్పారు. లేఖలో ఎంపి ఏమి చెప్పదలచుకున్నారంటే ముగ్గురు రెడ్లు కలిసి తనకు వ్యతిరేకంగా కుట్ర చేసినట్లు చెప్పాలని. తన ఆరోపణలకు మద్దతుగా కేపీ రెడ్డి కాల్ డేటాపై విచారణ జరపాలని కూడా సూచించారు. సరే కేపీ రెడ్డి కానీ అమ్మిరెడ్డి కానీ పెద్దగా స్పందించలేదు. అయితే ధర్మారెడ్డి మాత్రం ఓ టీవీ చానల్ తో ఇదే విషయమై మాట్లాడారు.

మే 3-18 తేదీల మధ్య తాను తిరుమలలోనే ఉన్నట్లు చెప్పారు. ఎంపి ఆరోపించినట్లు తాను హైదరాబాద్ లో లేనని స్పష్టంగా చెప్పారు. ఇక కేపీ రెడ్డితో కలిసి కుట్ర చేసిన ఆరోపణలపై మాట్లాడుతు అసలు కేపీ రెడ్డి ఎవరో కూడా తనకు తెలీదన్నారు. ఎంపి చెప్పిన తేదీల్లో తాను తిరుమల వదిలి వెళ్ళినట్లు నిరూపించగలిగితే ఉద్యోగానికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సవాలు విసిరారు.

తన మొబైల్ నెంబర్ కు సంబంధించి మూడు సంవత్సరాల రికార్డులను పరిశీలించుకోవచ్చని కూడా ధర్మారెడ్డి చాలెంజ్ చేశారు. ఎంపికి వ్యతిరేకంగా తాను ఎవరితోను కుట్రలు చేయలేదన్నారు. ధర్మారెడ్డి ఇంత స్పష్టంగా ఎంపి ఆరోపణలపై చాలెంజ్ చేసిన తర్వాత తన ఆరోపణలకు ఆధారాలు చూపాల్సిన బాధ్యత ఇపుడు రఘురామపైనే ఉంది. ఏదో నోటికొచ్చిన ఆరోపణలు చేసేస్తే కుదరదు కదా. మరిపుడు ధర్మారెడ్డి చాలెంజ్ ను స్వీకరించి తగిన ఆధారాలను చూపి ధర్మారెడ్డితో రాజీనామా చేయిస్తారా ?