Begin typing your search above and press return to search.

మహాసంప్రోక్షణ మొదలైంది..సగానికి తగ్గిన భక్తులు

By:  Tupaki Desk   |   12 Aug 2018 6:48 AM GMT
మహాసంప్రోక్షణ మొదలైంది..సగానికి తగ్గిన భక్తులు
X
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా మొదలైంది. ఆదివారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయంలోని అదనపు పరకామణి ప్రాంతంలో యాగశాలను సిద్ధం చేశారు.

శ్రీవారి మూలవర్లకు ఐదు, ద్వారపాలకులకు ఒకటి, విమాన వేంకటేశ్వరస్వామికి ఒకటి, గరుడాళ్వారుకు, ఆలయ గోపురానికి ఒకొక్కటి, అన్నప్రసాద పోటు తాయారుకు ఒకటి, పడిపోటు తాయారుకు ఒకటి, విష్వక్సేనుల వారికి ఒకటి, భాష్యకార్లకు ఒకటి - యోగ నరసింహస్వామి వారికి - ఆలయ గోపురానికి కలిపి రెండు - రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణస్వామికి ఒకటి - బేడి ఆంజనేయస్వామి వారు - ఆలయ గోపురానికి కలిపి రెండు, ఇతర వాస్తు హోమ గుండాలు కలిపి మొత్తం 28 హోమ గుండాలను ఏర్పాటు చేశారు. సంప్రోక్షణ కార్యక్రమాల్లో 44 మంది రుత్వికులు - 16 మంది సహాయకులు - ఇతర వేద పారాయణదారులు పాల్గొంటున్నారు. వీరికి ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి నేతృత్వం వహిస్తారు.

తిరుమలలో మహాసంప్రోక్షణం సందర్భంగా టీటీడీ ముందస్తు చేసిన ప్రకటనల కారణంగా భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. తిరుమలకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కాగా మహాసంప్రోక్షణం పేరుతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలను ఎక్కువ ప్రచారం చేయడం పలు విమర్శలకు దారితీసింది.

ఆలయాన్ని వారం రోజుల పాటు మూసివేస్తామని చెప్పడంతో - దానిపై భక్తులు నిరసనలు వ్యక్తం చేశారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో టీటీడీ శనివారం 50 వేల మందికి దర్శనం ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయితే తమకు దర్శనభాగ్యం ఉంటుందో ఉండదో అనే అనుమానంతో తిరుమలకు ఎక్కువమంది రాలేదు. శనివారం 50,900 మందికి అవకాశం ఉన్నా - రాత్రి వరకు 22 వేల మంది మాత్రమే తిరుమలకు వచ్చి - శ్రీవారి దర్శనం చేసుకున్నారు.