Begin typing your search above and press return to search.

ఇళ్ల పేరుతో రూ.900 కోట్లు వసూలు చేసిన టీటీడీ సభ్యుడు!

By:  Tupaki Desk   |   3 Dec 2022 5:23 AM GMT
ఇళ్ల పేరుతో రూ.900  కోట్లు వసూలు చేసిన టీటీడీ సభ్యుడు!
X
తక్కువ ధరకే ఇళ్లు కట్టించి ఇస్తానంటూ రూ.900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ((టీటీడీ) సభ్యుడు, సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే డబుల్‌ బెడ్‌రూమ్, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించి ఇస్తానంటూ 2500 మంది నుంచి రూ.900 కోట్లు బూదాటి లక్ష్మీనారాయణ వసూలు చేశారని చెబుతున్నారు. అంతేకాకుండా ఫ్లాట్ల ప్రారంభానికి ముందే (ప్రీ లాంచ్‌) కడితే ఇంకా తక్కువకే ఇళ్లు అప్పగిస్తానని భారీగా ఆయన వసూలు చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా ప్రీలాంచ్‌ ప్రాజెక్టుల పేరుతో హైదరాబాద్, నగర పరిసర ప్రాంతాలైన అమీన్‌పూర్, శామీర్‌పేటల్లో సాహితీ శరవణి ఎలైట్‌ ప్రాజెక్టు పేరుతో ప్రజల నుంచి ఆయన ముందస్తుగా నగదు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పోలీసులు, ఆర్థిక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... సాహితీ ఇన్‌ఫ్రా టెక్‌ ఎండీ లక్ష్మీనారాయణ 2019లో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలో సాహితీ శరవణి ఎలైట్‌ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. ఇందులో భాగంగా 23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నానని ప్రకటించారు. డబుల్‌ బెడ్‌రూమ్, త్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ అందుబాటులో ఉంటాయన్నారు.

అన్ని వసతులతో తక్కువ ధరకే నిర్మిస్తామని ప్రకటించారు. దీంతో ఆకర్షితులైన ప్రజల నుంచి ప్రీ లాంఛ్‌ ఆఫర్‌ అంటూ 1,700 మంది నుంచి ఏకంగా రూ.539 కోట్ల మేర వసూలు చేశారు.

వాస్తవానికి... ఈ ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష్మీనారాయణ హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నుంచి ఎలాంటి అనుమతీ తీసుకోలేదు. అనుమతులు రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. అయితే మూడేళ్లు పూర్తయినా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో తమకు ఇళ్లు వద్దని.. తమ డబ్బులు తమకు ఇచ్చేయాలని ప్రజలు కోరారు. దీంతో ప్రజల నుంచి సేకరించిన సొమ్మును సంవత్సరానికి 15–18 శాతం వడ్డీతో తిరిగి ఇస్తానని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆ తర్వాత కొందరికి చెక్కులు ఇచ్చారు. అవి బౌన్స్‌ అవ్వడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా లక్ష్మీనారాయణ అమీన్‌పూర్‌ ప్రాజెక్టుతో పాటు మరిన్ని ప్రీ లాంచ్‌ పథకాల పేరుతో ఇలాగే ప్రజల నుంచి భారీగా వసూలు చేశారని పోలీసులు చెబుతున్నారు. సాహితీ శరవణి ఎలైట్‌ పేరుతో హైదరాబాద్‌ శివార్లలోని ప్రగతినగర్, బొంగుళూరు, కాకతీయ హిల్స్, అయ్యప్ప సొసైటీ, కొంపల్లి, శామీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లోనూ ప్రాజెక్టుల పేరుతో ప్రజల నుంచి భారీగా వసూలు చేశారని అంటున్నారు.

ఇలా తక్కువ ధరకే ఇళ్లంటూ 2,500 మంది నుంచి రూ.900 కోట్లు లక్ష్మీనారాయణ వసూలు చేశారని పోలీసులు చెబుతున్నారు. మాదాపూర్, జూబ్లీహిల్స్, పేట్‌ బషీరాబాద్, బాచుపల్లి పోలీసు స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. తీవ్ర ఆర్థిక నేరం కావడంతో హైదరాబాద్‌ సీసీఎస్‌లోనూ కేసు దాఖలైంది. ఈ వ్యవహారంలో ఈ ఏడాది ఆగస్టులో లక్ష్మీనారాయణ సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు.

ఇళ్ల పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన రూ.900 కోట్లు లక్ష్మీనారాయణ ఆ డబ్బును ఆంధ్రప్రదేశ్‌లోని రాజధాని అమరావతిలోని వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెట్టారని పోలీసులు చెబుతున్నారు. అందులోనూ లక్ష్మీనారాయణది గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతమేనని.. దీంతో ప్రజల నుంచి వసూలు చేసిన భారీ మొత్తాలను ఈ ప్రాంతంలోనే ఇన్వెస్ట్‌ చేశారని తెలుస్తోంది.

కాగా నిధుల మళ్లింపు కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సైతం లక్ష్మీనారాయణ వ్యవహారాలపై దృష్టి సారించిందని చెబుతున్నారు. లక్ష్మీనారాయణకు ప్రముఖ రాజకీయ నేతలతోనూ సంబంధాలున్నాయని అంటున్నారు. ఈయన దగ్గర ఇళ్లకు డబ్బులు కట్టినవారిలో ప్రవాసులు, ఐటీ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉండటం గమనార్హం.

కాగా టీటీడీ సభ్యత్వానికి బూదాటి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతో 2021 సెప్టెంబరులో లక్ష్మీనారాయణ తితిదే బోర్డు సభ్యుడిగా ప్రమాణం చేశారని చెబుతున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.