Begin typing your search above and press return to search.

తిరుమల వెంకన్న కోసం డ్రోన్‌ కెమెరాల్తో భద్రత!

By:  Tupaki Desk   |   9 Sep 2015 4:09 AM GMT
తిరుమల వెంకన్న కోసం డ్రోన్‌ కెమెరాల్తో భద్రత!
X
'డ్రోన్‌ లు'- గాలిలో ఎగురుతూ... మీకు అవసరమైన సేవలు చేసిపెట్టగల ఈ టెక్నాలజీని రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కోణాల్లోంచి చూస్తూ ఉండడం విశేషం. డ్రోన్‌ కెమెరాలను ఇప్పటికే భద్రత నిమిత్తం పలు కీలక సందర్భాల్లో వినియోగించడం జరుగుతోంది. తాజాగా వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల గిరుల్లో భద్రతను నిరంతరాయంగా.. మరింత పటిష్టంగా పర్యవేక్షించేందుకు డ్రోన్‌ కెమెరాలను వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. రాత్రీ పగలూ తేడా లేకుండా ఈ డ్రోన్‌ లు, పవర్‌ ఫుల్‌ రిజల్యూషన్‌ ఉన్న కెమెరాలతో సహా.. తిరుమల గిరులపై గాలిలో ఎగురుతూ విహంగవీక్షణం చేస్తుంటాయి. వీటిని అనుసంధానించిన కేంద్రంలో అధికారులు గమనిస్తూ భద్రతను పర్యవేక్షిస్తారు.

డ్రోన్‌ కెమెరాల టెక్నాలజీ మరీ కొత్తదేం కాదు. ఇప్పటికే పలు కీలక సందర్భాల్లో డ్రోన్‌ లను వాడుతూనే ఉన్నారు. అయితే ఒకవైపు ఈ డ్రోన్‌ లు ఎంతగా భద్రత ఏర్పాట్లకు ఉపయోగపడుతున్నాయో.. అంతగా బెంబేలెత్తిస్తున్నాయి కూడా. రెండు రోజుల కిందటే.. హైదరాబాదులో ముందస్తు అనుమతి లేకుండా ప్రెవేటు వ్యక్తులు డ్రోన్‌ లను వినియోగించడాన్ని నిషేధించారు. వీటివల్ల ఉగ్రవాదులు చాలా సులువుగా దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నదనే అనుమానంతో ఇలా నిషేధం విధించారు.

అదే తిరుమలలో కొత్తగా వాటిని భద్రత కోసం వాడుతున్నారు. ప్రతిరోజూ సగటున 70 వేల మందికి పైగా భక్తకోటి వస్తూ ఉండే.. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుమల మీద ఉగ్రవాదులు కన్నేస్తే పసిగట్టడం కూడా చాలా క్లిష్టమైన పని. అందుకే.. పోలీసులు తాజాగా డ్రోన్‌ ల ద్వారా నిఘాను కూడా పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.