Begin typing your search above and press return to search.

ఒంటిమిట్ట రామయ్యతో జంట కట్టిన వెంకన్న

By:  Tupaki Desk   |   9 Sep 2015 9:09 AM GMT
ఒంటిమిట్ట రామయ్యతో జంట కట్టిన వెంకన్న
X
కడప జిల్లాలోని పురాతన ఒంటిమిట్ట కోదండ రామాలయం దశ తిరగనుంది. రాష్ట్ర విభజన తరువాత భద్రాచలంలోని రామాలయం తెలంగాణకు చెందడంతో ఏపీలో ప్రభుత్వపరంగా శ్రీరామనవమిని ఒంటిమిట్టలోనే నిర్వహించారు. దీంతో ఒంటిమిట్టకు గుర్తింపు పెరిగింది. ఇప్పుడు ఆ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కు అప్పగించడంతో ఆలయ ప్రగతికి మరింత అవకాశం ఏర్పడింది. ఒంటిమిట్ట ఆలయంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఒంటిమిట్ట రామాలయాన్ని టిటిడి ఆగమశాస్త్రం ప్రకారం అధికారికంగా విలీనం చేసుకుంది. బుధవారం ఈ విలీనం ప్రక్రియ పూర్తయింది. ఈ విలీన ప్రక్రియకు టిటిడి పాలక మండలి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, పసులేటి హరిప్రసాద్‌, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జున రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ శంకర్‌ బాలాజీ హాజరయ్యారు.

ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని.. రామాలయం వేంకటేశ్వరస్వామి సన్నిధికి చేరినందున ఆలయాభివృద్ధికి ఎట్టి పరిస్థితులలో నిధుల కొరత రానివ్వమని చదలవాడ ఈ సందర్భంగా చెప్పారు. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు టిటిడి నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వ లాంఛనాలను తీసుకొస్తారన్నారు. కాగా ఏప్రిల్‌ లో జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం చంద్రబాబు రూ.100కోట్ల అభివృద్ధి పనులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే... ఆ హామీ నెరవేరుస్తామని టీటీడీ పూర్తిచేయడానికి సిద్ధమవుతోంది.