Begin typing your search above and press return to search.

కశ్మీర్ లో శ్రీవారి ఆల‌యం.. భూమిపూజ స‌మాప్తం

By:  Tupaki Desk   |   13 Jun 2021 1:59 PM GMT
కశ్మీర్ లో శ్రీవారి ఆల‌యం.. భూమిపూజ స‌మాప్తం
X
జ‌మ్మూ క‌శ్మీర్ లో తిరుమ‌ల శ్రీవారి ఆల‌య నిర్మాణం మొద‌లైంది. ఇందుకు సంబంధించి ఈ ఆదివారమే భూమి పూజ‌కూడా నిర్వ‌హించారు. జ‌మ్మూ నుంచి ఎనిమిది కిలోమీట‌ర్ల దూరంలో ఉండే మ‌జీన్ ప్రాంతంలో ఈ ఆల‌యాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆల‌యానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ గ‌తంలోనే పూర్త‌యింది. మొత్తం 62 ఎక‌రాల్లో ఆల‌యం నిర్మాణంతోపాటు ఇత‌ర సౌక‌ర్యాల‌ను స‌మ‌కూర్చ‌నుంది టీటీడీ.

మొత్తం ఆల‌యంతో కూడిన కాంప్లెక్స్ నిర్మించ‌డానికి టీటీడీ 33 కోట్ల రూపాయ‌లను ఖ‌ర్చు చేస్తోంది. ఆల‌య నిర్మాణానికి సంబంధించిన భూమిని టీటీడీ 40 సంవ‌త్స‌రాల‌కు లీజుకు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ఆల‌యంతోపాటు వేద పాఠ‌శాల‌, టీటీడీ ఉద్యోగులకు క్వార్ట‌ర్ల‌ను నిర్మిస్తారు. ద‌శ‌ల‌వారీగా వీటి నిర్మాణం పూర్త‌వుతుంది.

రెండేళ్లలో ప్ర‌ధాన ఆల‌యాన్ని పూర్తిచేయాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. భూమిపూజ‌ కార్య‌క్ర‌మానికి జ‌మ్మూక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా, కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ నాయ‌కుడు రామ్ మాధ‌వ్, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.