Begin typing your search above and press return to search.

పొత్తుతో చిత్తు.. ఎల్.రమణకు కష్టాలు..

By:  Tupaki Desk   |   13 Sep 2018 10:33 AM GMT
పొత్తుతో చిత్తు.. ఎల్.రమణకు కష్టాలు..
X
పొత్తుల ఎత్తుల్లో టీడీపీ చిత్తవుతోంది. తన బలాన్నిచూసి వాపు అనుకుంటోంది. గతంలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు తెలంగాణలో దాదాపు కనుమరుగైపోయిన పరిస్థితి. అందుకే సొంతంగా పోటీ చేసే దైర్యం లేక కాంగ్రెస్ పంచన చేరింది. మహాకూటమికి స్కెచ్ గీసింది. బలమైన టీఆర్ ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కూడా కూటమి ఏర్పాటుకు ముందడుగు వేసింది.

కానీ ఈ కూటమిలో ఇప్పుడు సీట్ల కేటాయింపులు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. టీడీపీ తమకు 30 నుంచి 40 సీట్లు కావాలని డిమాండ్ చేయడం.. కాంగ్రెస్ మాత్రం గడిచిన ఎన్నికల్లో గెలిచిన 15 సీట్లు మాత్రమే ఇస్తామని.. అంతకుమించి ఇవ్వలేమని ఖరాఖండీగా చెబుతుండడం జరిగిపోయిందంట.. ఏపీ సీఎం చంద్రబాబు - టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పినా కాంగ్రెస్ నేతలు వినడం లేదని సమాచారం.

ఈ పొత్తుల వ్యవహారంతో అటు టీడీపీనే కాదు.. కాంగ్రెస్ కూడా ఇబ్బంది పడుతోంది. దాదాపు 30 సీట్ల దాకా టీడీపీ - సీపీఐ - సీపీఎం ఇతర పక్షాలకు కోల్పోతుండడంతో ఆ సీట్లలో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెబల్ గా మారి పార్టీకి నష్టం తెచ్చేలా కనిపిస్తున్నారు.

అయితే ఈ పొత్తుల ప్రక్రియలో స్వయంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణకే సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరిస్తుండడం తాజాగా చంద్రబాబును - రమణను కలవరపెడుతోందట.. ఎల్. రమణ గడిచిన 2014 ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. జీవన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఉపశాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. జానారెడ్డి తర్వాత అంతటి సీనియర్ నేత కావడంతో ఆయన సీటును త్యాగం చేయించి రమణకు ఇచ్చేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసిందట..

దీంతో రమణను జూబ్లీహిల్స్ లేదా కూకట్ పల్లి నుంచి పోటీచేయించాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున మాగంటి గోపీనాథ్ - మాధవరం కృష్ణారావు పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత వీరిద్దరూ టీఆర్ ఎస్ లో చేరిపోయారు. దీంతో ఖాళీగా ఉన్న ఈ సీట్లలో రమణను పోటీచేయాలని బాబు కోరుతున్నాడట.. హైదరాబాద్ లో బలంగా ఉన్న టీడీపీ కేడర్ వల్ల రమణ కూడా ఇక్కడ పోటీచేయడానికి ఆసక్తి చూపుతున్నాడట.. దీంతో పొత్తుల వల్ల టీడీపీకి ఈ పరిస్థితి దాపురించిందని అందరూ అయ్యో పాపం అంటున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడికే సీటు కన్ఫం కాని వైనంపై అందరూ విస్తుపోతున్నారు.