Begin typing your search above and press return to search.

ముందు జాగ్రత్త:తమ్ముళ్లు బీజేపీకే వదిలేస్తున్నారా?

By:  Tupaki Desk   |   26 Oct 2015 3:50 AM GMT
ముందు జాగ్రత్త:తమ్ముళ్లు బీజేపీకే వదిలేస్తున్నారా?
X
వరంగల్ ఉప ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. చూస్తూ.. చూస్తూ తలనొప్పి తెచ్చి పెట్టుకునే కన్నా.. మిత్రధర్మం పేరిట బీజేపీకి అవకాశం ఇవ్వటం ద్వారా సేఫ్ గేమ్ ఆడాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో అంతంతమాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి వరంగల్ ఉప ఎన్నిక షాక్ తగలకూడదన్న ఆలోచనలో తమ్ముళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ తహతహలాడుతోంది. తాము కూడా పోటీకి దిగుతామని తెలుగుదేశం డిసైడ్ చేస్తే.. మిత్రపక్షం మనసును గాయపర్చినట్లు అవుతుందన్నది ఆలోచన. ఒకవేళ ఒత్తిడి చేసి అభ్యర్థిని ఎంపిక చేసి బరిలోకి దించినా గెలుస్తామన్న నమ్మకం తమ్ముళ్లలో కనిపించటం లేదు.

ఈ నేపథ్యంలో గెలుపు విషయంలో ఏ మాత్రం నమ్మకం లేని సమయంలో బరిలోకి దిగే కన్నా.. పోటీ చేయాలని తపిస్తున్న బీజేపీకి అవకాశం ఇవ్వటం ద్వారా.. తెలంగాణలో తమకున్న బలాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ భావిస్తోన్నట్లు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో అనవసరమైన తప్పుల్ని చేయకూడదన్న లక్ష్యంతోనే వరంగల్ ఉఫ ఎన్నికకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం అభ్యర్థి కానీ బరిలోకి దిగితే.. సదరు అభ్యర్థిని గెలిపించే క్రమంలో పార్టీ జాతీయ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీన్లోకి రావాల్సి ఉంటుంది. ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రచారానికి దూరంగా ఉంటే విమర్శలు తప్పువు. అలా అని ప్రచారం చేసిన తర్వాత సదరు అభ్యర్థి ఓడిపోతే.. అందుకు బాబు సైతం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తపిస్తున్న మిత్రపక్షానికి అవకాశం ఇవ్వాలని తమ్ముళ్లు ఆలోచిస్తున్నారు.

మరోవైపు.. పార్టీ అభ్యర్థులుగా ముగ్గురు పేర్లను ఫైనల్ లిస్ట్ గా బీజేపీ తయారు చేసింది. వారిలో డాక్టర్ పంగిడి దేవయ్య.. డాక్టర్ రాజమౌళి.. డాక్టర్ ఎ. చంద్రశేఖర్ లు ఉన్నారు. వీరిలో పంగిడి దేవయ్య బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆయన అమెరికాలో స్థిరపడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పేరుంది. ఇక.. మరో అభ్యర్థి అయిన రాజమౌళి కూడా వైద్యులే. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఘన చరిత్ర ఉంది. ఇక.. మూడో వ్యక్తిగా ప్రచారం పొందుతున్న చంద్రశేఖర్ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నా.. తనకు కానీ టిక్కెట్టు ఇస్తే బీజేపీలోకి వస్తానని చెప్పినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ ముగ్గురిలో ఎవరికి టిక్కెట్టు దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ అనూహ్యంగా ఇంకెవరినైనా సీన్లోకి తీసుకొస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.