Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు ఎవరు?

By:  Tupaki Desk   |   11 Feb 2016 11:30 AM GMT
ఆ ముగ్గురు ఎవరు?
X
ఎర్రబెల్లి దయాకరరావు టీడీపీని వీడుతూ ఓ పెద్ద ప్రశ్నను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు ఉంచి మరీ వెళ్లారు. టీఆర్‌ ఎస్‌ కండువా కప్పుకున్న సందర్భంగా ఎర్రబెల్లి … త్వరలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ ఎస్‌ లో చేరుతారని చెప్పడం ద్వారా టీడీపీ నేతలకు మరింత కంగారు పుట్టించారు. ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై లెక్కలేసుకుంటున్నారు. 2014లో టీటీడీపీ తరపున మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో 9 మంది పార్టీని వీడి వెళ్లగా ఆరుగురు మాత్రమే మిగిలారు.

రేవంత్ రెడ్డి - మాగంటి గోపినాథ్ - నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి - శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ - ఖమ్మం జిల్లాకుచెందిన సండ్ర వెంకటవీరయ్య - ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాత్రమే ప్రస్తుతం పార్టీలో మిగిలారు. రేవంత్ రెడ్డి ఎలాగో టీఆర్‌ ఎస్‌ లోకి వెళ్లే అవకాశం లేదు. చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన మాగంటి గోపినాథ్ పార్టీ వీడడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. పైగా ఆయనను గ్రేటర్ అధ్యక్షుడిగా కూడా నియమించారు. ఆర్.కృష్ణయ్యకు పార్టీతో సంబంధాలే లేవు. ఆయన టీఆరెస్ లోకి వెళ్లే అవకాశమూ లేదు. ఎర్రబెల్లి టీఆర్‌ ఎస్‌ లో చేరిన వెంటనే సండ్ర తీవ్రంగా స్పందించారు. ఎర్రబెల్లి నయవంచకుడు అని అభివర్ణించారు. పైగా సండ్ర ఓటుకు నోటు కేసులో నిందితుడు కూడా. కాబట్టి సండ్ర పై టీడీపీ నేతలు పెద్దగా అనుమానం వ్యక్తం చేయడం లేదు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలపై అనుమానపు చూపులు ఉన్నాయి. ఆ ముగ్గరు ఎవరని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.