Begin typing your search above and press return to search.

ఎల్.రమణకు ఎగ్జిట్ చూపిస్తున్నారా?

By:  Tupaki Desk   |   2 Aug 2016 11:30 AM GMT
ఎల్.రమణకు ఎగ్జిట్ చూపిస్తున్నారా?
X
చంద్రబాబుకు వీరవిధేయుడిగా పేరున్న తెలంగాణ‌ తెలుగుదేశం పార్టీ నేత ఎల్‌.ర‌మ‌ణ‌ను పార్టీ నుంచి బయటకుపంపించే ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా టాక్. ఆయ‌నే స్వ‌యంగా త‌ప్పుకునేలా టీటీడీపీలోని ఓ వ‌ర్గం పావులు కదుపుతోందని తెలుస్తోంది. ఆయనకు పొగబెట్టే పని చాలాకాలంగా అండర్ కరెంటుగా జరుగుతోందని చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయనపై లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని.. గోరంతలు కొండంతలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆయన రాజ‌కీయ అస్ర్త స‌న్యాసం చేయబోతున్నారన్న ప్రచారం వెనుక కారణం ఇదేనని తెలుస్తోంది.

ర‌మ‌ణ‌పై జ‌రుగుతున్న ప్ర‌చారమంతా ఉత్తదేనంటున్నారు ఆయన అనుచ‌రులు. ర‌మ‌ణ‌ను పార్టీ నుంచి త‌ప్పించ‌డమో.. లేక పార్టీ ప‌గ్గాల నుంచి త‌ప్పించి రేవంత్ రెడ్డికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌న్న ప్ర‌య‌త్నాలు కొంత‌కాలంగా జరుగుతున్నాయని.. అందులోభాగమే ఈ ప్రచారాలని వారు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ‌లో టీడీపీ నుంచి 15 ఎమ్మెల్యేలు గెలవగా వారిలో 12 మంది పార్టీ మారారు. శాస‌న‌స‌భాప‌క్షం టీఆర్ ఎస్‌ లో విలీనమైన త‌రువాత‌… పార్టీ కూడా విలీనం అవుతుంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. తెలంగాణ‌లోని అన్ని జిల్లాల టీడీపీ అధ్య‌క్షులు అంతా క‌లిసి పార్టీని విలీనం చేస్తున్నామ‌ని ఈసీకి లేఖ ఇస్తార‌న్న ప్ర‌చారం పార్టీని కుదిపేసింది. మొద‌ట్లో ఇదంతా టీఆర్ ఎస్ ప్ర‌చారంగా భావించారు ర‌మ‌ణ అనుచ‌రులు. కానీ ఇప్పుడు వారిలో కొత్త అనుమానాలు పొడజూపుతున్నాయి. ఇదంతా రేవంత్ రెడ్డి వ‌ర్గం కుట్ర‌గా అనుమానిస్తున్నారు.

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ విష‌యంలో పార్టీ పిలుపును కాద‌ని రేవంత్ తన సొంత ఎజెండాతో ముందుకు పోవ‌డంపై ర‌మ‌ణ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. క‌నీసం రేవంత్ చేప‌ట్టిన దీక్ష స్థ‌లిలో వెలిసిన పోస్టర్ల‌లోనూ ఎక్క‌డా ర‌మ‌ణ ఫొటో లేక‌పోవ‌డం ఆయ‌న అస‌హ‌నాన్ని మ‌రింత పెంచింది. ర‌మ‌ణ ఆగ్ర‌హించాడ‌ని తెలిసినా.. రేవంత్ లైట్ తీసుకున్నాడు. అధిష్టానం వ‌ద్ద రేవంత్ పై ఫిర్యాదు చేసినా ఫ‌లితం శూన్యం. దీంతో మ‌రింత నొచ్చుకున్నాడు ర‌మ‌ణ‌. కొంత‌కాలంగా ర‌మ‌ణ‌ టీఆర్ ఎస్‌ లో చేరుతున్నాడ‌ని… ఆయ‌న రాజ‌కీయ అస్ర్త‌స‌న్యాసం చేయ‌బోతున్నాడ‌ని మ‌రోసారి ప్ర‌చారం జరుగుతోంది. ఇది కూడా రేవంత్ రెడ్డి వర్గం పనేనని ర‌మ‌ణ వ‌ర్గీయులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. రేవంత్ ఒంటెత్తు పోక‌డ‌ల‌పై ఫిర్యాదు చేశాడ‌న్న అక్క‌సుతోనే ఇలాంటి దుష్ప్ర‌చారాల‌కు పాల్ప‌డుతున్నార‌ని భావిస్తున్నారు. మొత్తానికి ర‌మ‌ణ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నా - పార్టీ మారినా ఇప్ప‌టికిప్పుడు క‌లిసి వ‌చ్చేది ఒక్క రేవంత్ రెడ్డికి మాత్ర‌మే. అందుకే, ర‌మ‌ణ‌పై జ‌రుగుతున్న దుష్ప్ర‌చార‌మంతా రేవంత్ వ‌ర్గీయుల ప‌నేన‌ని ఆయ‌న అనుచ‌రులు అనుమానిస్తున్నారు.