Begin typing your search above and press return to search.

చంద్రబాబు దెబ్బకు టీటీడీపీ ఖాళీ?

By:  Tupaki Desk   |   4 March 2017 7:46 AM GMT
చంద్రబాబు దెబ్బకు టీటీడీపీ ఖాళీ?
X
అసలే అంతంతమాత్రంగా బతుకీడుస్తోంది తెలంగాణ టీడీపీ. అలా మూలుగుతున్న టీటీడీపీ నక్కపై చంద్రబాబు మరోసారి తాటికాయలా పడ్డారు. దీంతో పార్టీ ఏమవుతుందా అన్న పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఏర్పడడం తనకు బాధ కలిగించిందని చంద్రబాబు అనడంతో ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు ఇరుకుపడుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తోచక బిక్కయిపోయారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు కావొస్తోంది. విభజన వాస్తవాన్ని జనం మెల్లగా దిగమింగుకున్నారు. దాదాపుగా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విభజనపై అక్కసు వెళ్ళగక్కుతూ ‘నా జీవితంలో ఎపుడూ అంత బాధ పడలేదు.. తలు పులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టి అంధకారం చేశారు. తెలంగాణ ఏర్పాటు మరిచిపోలేని బాధ - ఆవేదన - కలవరం కలిగించింది’’ అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం వివాదం రేపుతోంది. చంద్రబాబు ప్రకటనపై తెలంగాణ సమాజమే కాదు ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలూ మండిపడుతున్నారు. పార్టీ నుంచి ఎంతమంది పాలక టీఆరెస్ లోకి వెళ్లిపోయినా తాము కొనసాగుతూ పార్టీని బతికిస్తుంటే ఇప్పుడు తమనే ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని వారంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తామూ గులాబీ కండువా కప్పుకుంటే తప్ప జనంలోకి వెళ్లలేమని అంటున్నారు.

ఇప్పటికే చంద్రబాబు టీటీడీపీని పట్టించుకోవడం మానేశారు. పైగా ఇలాంటి వ్యాఖ్యలతో టీటీడీపీ నేతలకు కొత్త తలనొప్పులు తెస్తున్నారు. కష్టపడి పాదయాత్రలు చేసి.. సమావేశాలు నిర్వహించుకుని, కిందామీదా పడి కాస్త మైలేజీ తెచ్చుకోగానే.. బాబు ఒక్క ప్రకటన పడేయడంతో కష్టం ఆవిర వుతోందని పలువురు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా బాబుకు బాధ ఉండవచ్చ ని కానీ దానిని బహిరంగంగా సమావేశాల్లో, మీడియా ముందు వ్యక్తం చేస్తే తాము పార్టీలో ఉండి ఏం లాభమని, అలాంటపుడు తెలంగాణలో పార్టీ ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చి కూడా ఈ ప్రాంతంలో ఆ అంశాన్ని సరిగా చెప్పుకోలేని పరిస్థితి ఉందని.. అపుడపుడూ వస్తున్న ఇలాంటి ప్రకటనలతో ఆ అంశమే మరుగునపడి తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడుతోందిన పలువురు నేతలు వాపోతున్నారు.

బాబు ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలైనా మానాలి.. లేదంటే తెలంగాణలో పార్టీని మూసేయాలని పలువురు అంటున్నారు. బాబు వ్యాఖ్యలు ఆషామాషీవి కావని.. ఆయన మళ్లీ తెరవెనుక తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ పలు పార్టీల నేతలు టీడీపీ నేతలను టార్గెట్ చేసి అంటున్నారు. దీంతో టీడీపీ నేతలు ఇరకాటంలో పడుతున్నారు. బాబు ఇలాగే మాట్లాడితే ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా టీఆరెస్ లో చేరిపోవడం ఖాయమని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/