Begin typing your search above and press return to search.

మోడీ సభలో టీడీపీ ఆందోళన?

By:  Tupaki Desk   |   27 July 2016 9:44 AM GMT
మోడీ సభలో టీడీపీ ఆందోళన?
X
తెలంగాణలో ప్రస్తుతం రెండు అంశాలకు రాజకీయ ప్రాధాన్యం లభిస్తోంది. ఒకటి మల్లన్న సాగర్ నిర్వాసితుల పోరాటం కాగా రెండోది త్వరలో జరగనున్న ప్రధాని మోడీ పర్యటన. అయితే.. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో మోడీ పర్యటనలో మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆందోళనలు తప్పవకపోవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా అనుమానించి నిరసనల నివారణకు మార్గాలు వెతుకుతున్నారు. అయితే.. ఈ నిరసనలు తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటుందని దాదాపుగా కన్ఫర్మయింది. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ విష‌యంలో ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేయాల‌ని చూస్తున్న టీటీడీపీ ఇందుకోసం మోడీ స‌భ‌ను వేదిక‌గా చేసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. టీటీడీపీ ప్రకటన నేపథ్యంలో మోడీ పర్యటనలో టీడీపీ నుంచి నిరసనలు ఉంటాయన్న అంచనా వ్యక్తమవుతోంది.

తెలంగాణ‌లో వ‌చ్చేనెల‌లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాల ప్రారంభోత్స‌వాల అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ‌లో ఎలాగైనా స‌రే.. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూ నిర్వాసితుల నిర‌స‌న‌ను ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లాల‌ని టీడీపీ ప్లాన్ చేస్తోంది. బీజేపీ - టీడీపీ మిత్ర‌ప‌క్షాలుగా కేంద్రంలో - ఏపీలో కలసికట్టుగా ప్రభుత్వాలను నడుపుతున్నాయి. తెలంగాణ‌లోనూ క‌లిసి పోటీ చేశాయి. ఇప్పుడు అక‌స్మాత్తుగా ప్ర‌ధాని స‌భ‌లో ఆందోళ‌న‌కు ప్రణాళిక‌లు చేస్తుండ‌టంపై క‌మ‌ల‌నాథులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. మా ఆందోళ‌న‌ను ప్ర‌ధానికి తెలియ‌జేసి తీరుతాం అంటూ గ‌జ్వేల్ టీడీపీ నేత వంటేరు ప్ర‌తాప‌రెడ్డి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లను బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు.

దీంతో టీడీపీ - బీజేపీల మిత్ర‌బంధానికి మల్లన్న సాగర్ ముగింపు పలకనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నేపథ్యంలో జరపనున్న ఈ ఆందోళ‌నకు సాక్షాత్తు మోడీ సభను వేదికగా చేసుకోవాలని టీడీపీ అనుకుంటుండడంతో ఇది రెండు పార్టీల సంబంధాలను దారుణంగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే... ఈ విష‌యంలో బీజేపీతో మిత్ర‌బంధాన్ని తెలుగుదేశం తెంచుకోవాల‌ని చూస్తుందా?అన్నది కూడా అనుమానమే. ఒంటేరు ప్రతాపరెడ్డి వ్యాఖ్యలు యథాలాపమా లేకుండా పార్టీ అధినేత చంద్రబాబు ఆమోదంతో చేసినవేనా అన్నది తేలాల్సి ఉంది. చంద్రబాబు ఆమోదమే కనుక ఉంటే తెలంగాణలో మోడీ సభతో టీడీపీ - బీజేపీ బంధానికి మూడినట్లే అనుకోవాలి.