Begin typing your search above and press return to search.

ఐదు ఎమ్మెల్సీల్ని ఎలా గెలిపించుకున్నారు?

By:  Tupaki Desk   |   8 Jun 2015 4:28 PM GMT
ఐదు ఎమ్మెల్సీల్ని ఎలా గెలిపించుకున్నారు?
X
''చంద్రబాబు అత్యంత నీతిబాహ్యమైన..అత్యంత జుగుప్సాపరమైన రాజకీయాలకు తెర తీస్తున్నారు. రేవంత్‌ చేసింది తప్పు కానీ.. ఒప్పు కానీ అని ఆయన ఎందుకు చెప్పటం లేదు? దొంగపనులు చేయటానికి ముఖ్యమంత్రి పదవి లైసెన్సు కాదు. దొంగ పనులు చేస్తే మంత్రులైనా.. ముఖ్యమంత్రులైనా శిక్షించే అధికారం చట్టాని ఉంటుంది'' ఈ మాటలు ఎవరు చెప్పారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీముఖ్యమంత్రికి చెందిన ఆడియో టేపును తెలంగాణ అధికారపక్షానికి చెందిన టీ ఛానల్‌లో ప్రసారమైన తర్వాతి రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు.

తప్పులు చేయటం అంటే తమకు అస్సలు తెలీదని.. తప్పు చేయటం అంటే అసలు ఎలా ఉంటుందన్నట్లుగా కలర్‌ ఇచ్చిన కేటీఆర్‌తో పాటు.. తెలంగాణ అధికారపక్షానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సూటి ప్రశ్న ఒకటి అడుగుతున్నారు.

ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్‌ఎస్‌ సర్కారు.. ఐదుగురు ఎమ్మెల్సీల్ని ఎలా గెలిపించుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో 63 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. ఇప్పుడు తమకు 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఎలా చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

బేరసారాలు లేకుండానే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికారపక్షంలో చేరారా? తుమ్మల.. తలసాని ఇంటికి వెళ్లి చర్చలు జరపలేదా? అని ప్రశ్నిస్తున్న తెలంగాణ తెలుగు తమ్ముడు.. తాను కేసీఆర్‌ బెదిరింపులతోనే టీఆర్‌ఎస్‌లోకి చేరానని మాధవరం కృష్ణారావు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి.. తెలంగాణ తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్న ఈ సూటి ప్రశ్నలకు తెలంగాణ అధికారపక్ష నేతలు ఏం సమాధానం ఇస్తారో చూడాలి.