Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ తిట్ల పురాణం మీద మరెన్ని కేసులు పెట్టాలి?

By:  Tupaki Desk   |   4 July 2015 4:42 AM GMT
కేసీఆర్‌ తిట్ల పురాణం మీద మరెన్ని కేసులు పెట్టాలి?
X
జన్మకో శివరాత్రి అన్నట్లు.. నెల రోజులు జైల్లో ఉండి ఆ కడుపు మంటతో నాలుగు మాటలు అంటే మరీ అంత ఉడికిపోవాలా? ఒక్కరోజు తిట్లు తిడితేనే అంతలా అయిపోతన్నారు.. మరి.. కేసీఆర్‌ తిట్టే తిట్ల మాటేమిటి?.. ఇలాంటి ప్రశ్నలతో రేవంత్‌రెడ్డిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ తెలుగుదేశం నేతలు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్‌ అయి.. నెల రోజులు చర్లపల్లి జైలులో ఉండి.. బెయిల్‌ మీద బయటకు వచ్చిన సందర్భంగా బయటకు వచ్చిన రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే.

తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి.. తన కడుపు మంటను తీర్చుకునే ప్రయత్నం రేవంత్‌లో స్పష్టంగా కనిపించింది. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా అడ్డదిడ్డంగా తిట్టి పారేసే టీఆర్‌ఎస్‌ నేతలకు మించి మరీ తిట్టేయటం ఊహించని పరిణామంగా చెప్పొచ్చు. జైల్లో నుంచి బెయిల్‌ మీద బయటకు వచ్చిన వ్యక్తి ఆచితూచి వ్యవహరించటం తెలిసిందే.

అందుకు భిన్నంగా అధికారపక్షాన్ని దుమ్మెత్తిపోయటమే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రిపైన అయితే తీవ్రస్థాయి ఆరోపణలు చేయటం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రేవంత్‌రెడ్డి తిట్టిన తిట్లు.. ఉపయోగించిన భాషను టీఆర్‌ఎస్‌ నేతలు తప్పు పట్టారే తప్పించి.. ఆయన చేసిన ఆరోపణల్ని.. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రిపై చేసిన విమర్శల్ని తెలంగాణ అధికారపక్షంలోని ఎవరూ ఖండించకపోవటం గమనార్హం.

రేవంత్‌ ఉపయోగించిన భాష తెలంగాణ అధికారపక్షాన్నే కాదు.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు సైతం షాకింగ్‌ అనే చెబుతున్నారు. రేవంత్‌ ఆ స్థాయిలో విరుచుకుపడలేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్‌ వ్యాఖ్యలపై పలువురు తెలంగాణ మంత్రులు ఎదురుదాడి చేయటంపై మౌనంగా ఉన్న తెలుగుదేశం నేతలు.. సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన దరఖాస్తును రద్దు చేసిన తర్వాతే నోరు విప్పటం గమనార్హం.

ఇక.. టీటీడీపీ నేతల తాజా వ్యాఖ్యలు చూస్తే.. రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు.. ఉపయోగించిన భాషను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రేవంత్‌ ఒక్కసారి మాట్లాడితేనే అంతలా ఇబ్బంది పడుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు.. మరి ముఖ్యంత్రి కేసీఆర్‌ ఉపయోగించే భాష ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సమయంలో దాన్ని విభేదిస్తూ వెళ్లిపోయి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. తుమ్మల నాగేశ్వరరావులు ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోతున్నారంటూ మండిపడుతున్నారు.

ర్యాలీ అన్నది కావాలని చేసింది కాదని.. భారీగా తరలి వచ్చిన అభిమానులు అప్పటికప్పుడు ర్యాలీ నిర్వహించారని.. దీనికి రేవంత్‌కు సంబంధంలేదన్నారు. అంతేకాదు.. అభిమానులు ఆయనకు కత్తి.. గండ్ర గొడ్డలి లాంటివి బహుకరిస్తూ.. మారణాయుధాలు ప్రదర్శించారంటూ కేసులు పెట్టారని.. మరి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు.. గద.. కత్తులు.. బాణాలు పట్టుకున్నారని.. అప్పుడవి మారణాయుధాలు కావా? అని నిలదీస్తున్నారు. చూస్తుంటే.. రేవంత్‌ తిట్టిన తిట్లు తప్పు అన్నట్లుగా చెబుతూ.. రోజూ మీరు చేస్తున్నదే కదా అంటూ చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉందని చెప్పక తప్పదు.