Begin typing your search above and press return to search.

టీటీడీ ప‌ద‌వుల కోసం టీ త‌మ్ముళ్ల ప‌రుగులు

By:  Tupaki Desk   |   15 April 2018 5:20 AM GMT
టీటీడీ ప‌ద‌వుల కోసం టీ త‌మ్ముళ్ల ప‌రుగులు
X
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డులో ప‌ద‌వుల కోసం తెలుగుదేశం పార్టీలో భారీ పోటీ నెల‌కొంది. ఈ మ‌ధ్య‌నే టీటీడీ బోర్డు ఛైర్మ‌న్ గా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ను చంద్ర‌బాబు ఎంపిక చేయ‌టం తెలిసిందే. అన్య‌మ‌త ప్ర‌చారానికి పాల్ప‌డిన‌ట్లుగా పుట్టా మీద ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌న నియామ‌కం మీద ఇప్ప‌టికే ప‌లు హిందూసంస్థ‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. తిరుమ‌ల విష‌యంలో చంద్ర‌బాబు త‌ప్పు చేస్తున్నార‌ని.. కీల‌క‌మైన టీటీడీ ఛైర్మ‌న్ పోస్టు విష‌యంలో బాబు ఎంపిక స‌రిగా లేదంటూ విమ‌ర్శ‌లు భారీగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లోనే టీటీడీ బోర్డును పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్న వేళ‌లో.. ఈ ప‌ద‌వుల్ని చేజిక్కించుకోవ‌టానికి తెలంగాణ టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నాలు జోరందుకున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్ద‌రికి ప్రాతినిధ్యం ఉండేలా చంద్ర‌బాబు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

అలా టీటీడీ బోర్డులో చోటు సంపాదించిన వారిలో ఒక‌రు పార్టీ సీనియ‌ర్ నేత‌.. ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య కాగా.. మ‌రొక‌రు నిజామాబాద్ కు చెందిన ఎమ్మెల్సీ అరికెల న‌ర్సారెడ్డిని బాబు అప్ప‌ట్లో నియ‌మించారు. ఆ త‌ర్వాతి కాలంలో న‌ర్సారెడ్డి పార్టీ మారారు. నాటి బోర్డు ప‌ద‌వీకాలం ముగిసింది. ఈ నేప‌థ్యంలో కొత్త బోర్డు ఏర్పాటులో భాగంగా ఇప్ప‌టికే టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని పుట్టాకు క‌ట్ట‌బెట్టారు. మ‌రో వారం ప‌ది రోజుల్లో కొత్త బోర్డును ఏర్పాటు చేయ‌నున్న నేప‌థ్యంలో గ‌తంలో మాదిరి ఈసారి కూడా ఇద్ద‌రు తెలంగాణ నేత‌ల‌కు అవ‌కాశాన్ని బాబు ఇస్తార‌ని భావిస్తున్నారు.

దీంతో ఈ ప‌ద‌వుల కోసం తెలంగాణ తెలుగు త‌మ్ముళ్లు ఎవ‌రికి వారు పోటాపోటీ ప‌డుతున్నారు. టీటీడీ బోర్డు స‌భ్య‌త్వాన్ని సొంతం చేసుకునేందుకు తుండుగుడ్డ‌లు వేసుకునే ప్ర‌య‌త్నంలో బాబు చుట్టూ తిరుగుతున్నార‌న్న మాట వినిపిస్తోంది. పార్టీకి చెందిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌కు ఒక‌స్థానం ప‌క్కా అని.. మ‌రోస్థానాన్ని త‌మకే ఇవ్వాలంటూ ప‌లువురు నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీరిలో క‌రీంన‌గ‌ర్ జిల్లా నేత పెద్దిరెడ్డి.. న‌ల్ల‌గొండ నేత న‌న్నూరి న‌ర్సిరెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే వీరిద్ద‌రూ బాబును క‌లిసి త‌మ విన‌తిని తెలియ‌జేసిన‌ట్లుగా తెలుస్తోంది. వీరిలో న‌ర్సిరెడ్డి మొద‌ట బాబును క‌లిసి టీటీడీ బోర్డులో త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల్సిందిగా కోరిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ విష‌యం తెలిసిన పెద్దిరెడ్డి త‌న ప్ర‌య‌త్నాలు తాను ముమ్మ‌రం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పార్టీకి చెందిన మ‌రో సీనియ‌ర్ నేత అర‌వింద్ కుమార్ గౌడ్ సైతం టీటీడీ బోర్డులో స‌భ్యుడి కోసం ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఒక నేత‌కు క్రైస్త‌వ మిష‌న‌రీల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అయితే.. టీటీడీ ఛైర్మ‌న్ విష‌యంలోనే ఇలాంటి విమ‌ర్శ‌లు వినిపిస్తున్న వేళ‌.. బోర్డు స‌భ్యుడి ప‌ద‌వికి ఇలాంటివేమీ అడ్డంకి కావ‌ని.. బాబు మ‌న‌సు దోచుకోవ‌ట‌మే ముఖ్యంగా చెబుతున్నారు. టీటీడీ బోర్డు స‌భ్యుల కోసం తెలంగాణ తెలుగుదేశం నేత‌లు జోరుగా పోటీ ప‌డుతున్న వేళ‌.. చంద్ర‌బాబు ఎవ‌రికి అవ‌కాశం ఇస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.