Begin typing your search above and press return to search.

టీటీడీపీ రెండు ముక్క‌లు కానుందా?

By:  Tupaki Desk   |   11 Oct 2017 5:30 AM GMT
టీటీడీపీ రెండు ముక్క‌లు కానుందా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక ఆస‌క్తిక‌ర అంశంపై జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఏపీ అధికార‌ప‌క్షం.. తెలంగాణ‌లో నామ మాత్రంగా కూడా లేని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధికార‌ప‌క్షంలో పొత్తు పెట్టుకోనుంద‌న్న వాద‌న‌లు జోరుగా వినిపిస్తున్నాయి. మ‌రి.. ఇలాంటి సంచ‌ల‌న అంశాలు త‌ప్పు అయితే వెంట‌నే ఖండించాల్సిన అధినేత చంద్ర‌బాబు గ‌మ్మున ఉండ‌టం ఈ వాద‌న‌లో ఏదైనా విష‌యం ఉందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

తెలంగాణ తెలుగుదేశం నేత మోత్కుపల్లే స్వ‌యంగా గులాబీపార్టీతో పొత్తుకు ఛాన్స్ ఉంద‌న్న మాట‌తో మొద‌లైన చ‌ర్చ అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఇటీవ‌ల టీటీడీపీ నేత‌ల‌తో సీఎం చంద్ర‌బాబు భేటీ అయి.. పొత్తుల గురించి మాట్లాడే స‌మ‌యం కాద‌ని.. ఆ విష‌యంపై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని ఓపక్క చెబుతుంటే.. మ‌రోవైపు టీటీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత రేవంత్ రెడ్డి..పొత్తు అంశాన్ని వ్య‌తిరేకిస్తున్న తెలుగు త‌మ్ముళ్ల‌తో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించిన‌ట్లుగా చెబుతున్నారు.

టీఆర్ ఎస్ పొత్తు అంశంపై బాబుతో జ‌రిగిన భేటీ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దీనిపై బాబు స్పందించిన తీరుతో రేవంత్ ఈ ప్ర‌త్యేక స‌మావేశాల్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే.. పొత్తుపై బాబు సానుకూలంగా ఉన్నార‌న్న సందేహం క‌లిగేలా ఉన్నాయ‌ని చెబుతున్నారు. పొత్తు మాట‌పై స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించే విష‌యంలో బాబు నానుస్తున్న తీరు చూస్తుంటే.. కారుతో సైకిల్ జ‌త క‌ట్టే ఆలోచ‌న‌లు ఉన్నట్లుగా సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పొత్తు లాంటిపెద్ద మాట‌పై పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించిన‌ప్పుడు గ‌ట్టిగా ఖండించాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. తాజా ప‌రిణామాలేవీ అలా క‌నిపించ‌క‌పోవటం గ‌మ‌నార్హం. బాబు తీరుపై పొత్తును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వ‌ర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.బాబుతో మ‌రోసారి స‌మావేశ‌మై.. పొత్తు విష‌యంపై మ‌రింత క్లారిటీ తీసుకున్న త‌ర్వాతే భ‌విష్య‌త్ నిర్ణ‌యం తీసుకుందామ‌న్న మాట తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో వ్య‌క్త‌మైన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. గులాబీ పార్టీతో పొత్తు విష‌యంలో బాబు ఏ మాత్రం సానుకూలంగా ఉన్నా.. ఆ వెంట‌నే పార్టీని వీడిపోయేందుకు ఒక వ‌ర్గం సిద్ధంగా ఉంద‌ని చెబుతున్నారు. ఇందులో టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చురుగ్గా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. టీటీడీపీ కానీ టీఆర్ ఎస్‌ తో పొత్తు పెట్టుకుంటే.. ఎవ‌రి వ‌ర‌కో కాదు.. త‌న ఇంట్లోని వారు త‌న‌ను ఇంట్లోకి కూడా రానివ్వ‌ర‌ని వ్యాఖ్యానించ‌టం తెలిసిందే. పొత్తు విష‌యంలో బాబు ఏ మాత్రం ముందుకు వెళ్లినా రేవంత్ నేతృత్వంలో భారీ చీలిక ఖాయ‌మ‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి.. పార్టీని రెండు ముక్క‌ల‌య్యేలా బాబు నిర్ణ‌యం తీసుకుంటారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.