Begin typing your search above and press return to search.

దిక్కుతోచ‌ని స్థితిలో టీటీడీపీ

By:  Tupaki Desk   |   31 May 2018 4:14 AM GMT
దిక్కుతోచ‌ని స్థితిలో టీటీడీపీ
X
ఒక‌నాడు కీల‌క శ‌క్తిగా ఓ వెలుగు వెలిగి...నాలుగేళ్ల కింద‌టి వ‌ర‌కు కూడా ఓ బ‌ల‌మైన పార్టీగా స‌త్తా చాటి...ప్ర‌స్తుతం గుర్తింపు కోసం ఆరాట ప‌డుతుండ‌టం...ఇది స్థూలంగా తెలంగాణ‌లో టీడీపీ పార్టీ ప‌రిస్థితి. రాష్ట్ర విభ‌జ‌న ఉద్య‌మం తారాస్థాయికి చేర‌డం మొద‌లు టీడీపీ ప‌త‌నం ప్రారంభం అయింది. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ అధికార ప‌గ్గాలు చేప‌ట్టాక ఆ పార్టీ ఉనికే కోల్పోయే స్థితికి చేరింది. ఒక‌రి వెంట ఒక‌రు అన్న‌ట్లుగా ముఖ్య‌నేత‌లు పార్టీకి గుడ్‌ బై చెప్పేస్తున్న నేప‌థ్యంలో ఆ పార్టీ దిక్కుతోచ‌ని స్థితికి చేరింది. క‌నీసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా పొత్తుల‌తో బ‌య‌ట‌ప‌డాల‌ని చూస్తుంటే..ఓ ప‌ట్టాన ఆ విష‌యం తెమ‌ల‌డం లేదు. ఎందుకంటే...ఇక్కడ పొత్తులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్న నేప‌థ్యంలో అధినేత సైతం ఆ అంశాన్ని సాగ‌దీస్తున్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో కలిసివెళ్లాలన్న దానిపై టీడీపీలో అయోమయం నెలకొంది. ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ తోనో - టీఆర్ ఎస్‌ పార్టీతోనో ఏదో ఒకపార్టీతో తెలంగాణ టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నో చిక్కుముడులు ఇందులో ఉన్నాయంటున్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే క్రమంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ - టీఆర్ ఎస్‌ పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పొత్తు కుదరని సందర్భంలో అవసరమైతే ఓట్లు చీలకుండా చివరి సమయంలో తమ రెండు పార్టీల్లో ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలన్న అవగాహన కూడా కుదిరినట్టు వార్తలు వచ్చాయి. టీఆర్ ఎస్‌ పార్టీతో పొత్తును గతంలో మోత్కుపల్లి నర్సింహులు లాంటి కొంతమంది నేతలు సమర్థించారు. టీఆర్ ఎస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటే - తెలంగాణలో సీట్లు వస్తాయో లేదో కానీ - ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ ప్రజల నుండి దూరమవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు కారకులైన పార్టీతో పొత్తు పెట్టుకుని - ఏపీని దిక్కులేనిదానిగా చేశారన్న విమర్శలను ఎదుర్కోవల్సి ఉంటుందని టీడీపీ సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు మూడు సీట్ల కోసం పోతే, ఏపీలో పార్టీనే నాశనమవుతుందన్న బెంగ ఆ రాష్ట్ర పార్టీ నేతల్లో నెలకొంది.

ఒక‌వేళ‌, ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ఎన్నికలకు పోయినా ఏపీ టీడీపీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రేవంత్‌ రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు టీడీపీ - కాంగ్రెస్‌ పార్టీ కలిసి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఇటీవల కర్నాటకలో కాంగ్రెస్‌ - జేడీ(ఎస్‌) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. కర్నాటకలో రాహుల్‌ గాంధీతో చంద్రబాబు కలిసి ఫొటోలు దిగడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో తెలంగాణ - ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీ - కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు బెంగ‌ప‌డుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాలపై గందరగోళం లేకున్నా, తెలంగాణలో పొత్తులే టీడీపీకి కీలకం కానున్నాయన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే పొత్తులపై ఆచితూచి అడుగువేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ అనుసరించబోయే రాజకీయ పొత్తులపై ఏపీలోని ప్రతిపక్షాలు ఎదురుచూస్తు న్నాయి. ఆ రెండు పార్టీలతో కలిస్తే ప్రతిపక్షాల నుండి ఎలాం టి విమర్శలు వస్తాయో గ్రహించిన తర్వాతే చంద్రబాబు పొత్తులపై తొందరపడాల్సిన అవసరం లేదనీ, ఏదైనా ఎన్నికల ముందే నిర్ణయం ఉంటుందనీ, దానికి పార్టీ నేతలందరూ కట్టుబడాలని కోరారు. అయితే ఇది మ‌రింత అస్ప‌ష్టంగా ఉంద‌ని టీడీపీ నాయ‌కులే అంటుండ‌టం గ‌మ‌నార్హం.