Begin typing your search above and press return to search.

రేవంత్ కేంద్రంగా టీటీడీపీలో చీలిక‌?

By:  Tupaki Desk   |   28 Jun 2016 7:03 AM GMT
రేవంత్ కేంద్రంగా టీటీడీపీలో చీలిక‌?
X
తెలుగుదేశం తెలంగాణ శాఖలో అంతర్గత విభేదాలు మరోసారి రాజుకున్నాయా? మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు సంఘీభావంగా టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌ రెడ్డి చేసిన 48 గంటల దీక్ష ఇందుకు కారణమైందా? ఏకంగా వివాదం పార్టీ అధినేత చంద్ర‌బాబు చెవిన వేసే వ‌ర‌కు చేరిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. రేవంత్‌ రెడ్డి - పార్టీ అధ్యక్షులు ఎల్‌.ర‌మ‌ణ‌ వర్గాలుగా దాదాపు టీటీడీపీ చీలిపోయిందనే ప్రచారం ఆ పార్టీలో జోరుగు సాగుతోంది.

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో రేవంత్ రెడ్డి దీక్ష ఏకపక్షమని ఎల్‌.రమణ వర్గం వ్యాఖ్యానిస్తోంది. అయితే అందరికి చేప్పే చేశామని రేవంత్‌ అనుచరులు అంటున్నారు. అధినేత చంద్రబాబునాయుడు నుంచి ఈ దీక్షకు అనుమతి లేదని కొందరు అంటుండగా, ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రెండురోజుల పాటు సాగిన దీక్షకు హైదరాబాద్‌ నుంచే ర్యాలీగా పార్టీ నాయకులు - కార్యకర్తలు వెళ్లారు. ఆ పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులూ హాజరయ్యారు. అదే తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు - ఇతర పొలిట్‌ బ్యూరో సభ్యులు - సీనియర్‌ నాయకులు వెళ్లలేదు. మద్దతివ్వలేదు. ఇది దీక్ష నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా మరోసారి అభిప్రాయబేదాలను బ‌ట్ట‌బ‌య‌లు చేసింద‌ని అంటున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవారు ఉండగా, బాగా జరిగిందంటూ దీక్ష చేసిన రేవంత్‌ ను అభినందిస్తున్న వారూ లేకపోలేదు.

దీక్ష సందర్బంగా చేసిన ప్రచారంలో పార్టీ అధినేత చంద్రబాబును రేవంత్‌ పట్టించుకోలేదని, దీక్షాస్థలిలో బాబు కటౌట్లు - ప్లెక్సీలు - ప్లకార్డులుగాని లేవని రమణ వర్గం ఆరోపిస్తున్నది. ఆమేరకు కటౌట్లకు సంబంధించిన ఫోటోలు తీసి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. అదే సందర్భంలో తెలంగాణ కోసం మొదటి నుంచి కొట్లాడిన ప్రముఖుల ఫోటోలు - ఇతరుల ఫోటోలు పెట్టామని - అధినేతతోపాటు ఎవరినీ నిర్లక్ష్యం చేయాలనే తలంపు లేదని రేవంత్‌ వర్గీయులు చెప్పుకొస్తున్నారు. ఈవిషయం సీరియస్‌ గానే ఉన్నట్టు నేతల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఒకానొకదశలో రేవంత్‌ దీక్షను రద్దుచేయించేందుకు బాబు ద్వారా ప్రయత్నాలు చేశారని, అయితే అవి ఫలించలేదని కూడా తెలిసింది. ఈ రెండింటి మధ్య పార్టీలో అయోమయ వైఖరీ ఉన్నా, దీక్షను కొనసాగించడానికి రేవంత్‌ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ - ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్‌ గట్టిగా నిలబడిన నేపథ్యంలోనే మల్లన్నసాగర్‌ నిర్వాసితులు అత్యధిక సంఖ్యలో దీక్షకు వచ్చినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా. పార్టీని ముందుకు నడిపించడంలో రేవంత్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సీనియర్లను ఖాతరు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. త్వరలో రెండువర్గాలు కూడా చంద్రబాబును కలిసే అవకాశాలు లేకపోలేదని పార్టీ రాష్ట్రకార్యాలయంలో నేతల మధ్య గుసగసలు వినిపిస్తున్నాయి.