Begin typing your search above and press return to search.

అఫిషియ‌ల్ః క‌మ్యూనిస్టుల‌తో క‌లిసిన టీడీపీ

By:  Tupaki Desk   |   31 Oct 2016 12:40 PM GMT
అఫిషియ‌ల్ః క‌మ్యూనిస్టుల‌తో క‌లిసిన టీడీపీ
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు ఏక‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో కీల‌క ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ వేగంగా త‌న స‌మీక‌ర‌ణలు మార్చుకుంటోంది. వివిధ అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం రాష్ట్రవ్యాప్త మ‌హా పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారికంగా మ‌ద్ద‌తిచ్చింది. ప్రజాసమస్యలపై ఎవరు పోరాడినా వారికి మద్దతును ఇవ్వాలని టీడీపీ విధానపరమైన నిర్ణయం తీసుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి - రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు.

సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాదయాత్రకు మద్దతుగా హైదరాబాద్ నుంచి నాగర్ క‌ర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలానికి బయలుదేరిన సందర్భంగా రావుల - రేవంత్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని- అన్ని రంగాలలో ప్రభుత్వం విఫలమవుతుందని వారు విమర్శించారు. అయితే కేసీఆర్‌ కు వ్యతిరేకంగా - ప్రజాసమస్యలపై గళం విప్పిన నేతలను అణచివేయడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలను కూడా తొక్కిపెడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ కు - రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారికి తాము కూడా మద్దతుగా నిలవాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. జెండా-అజెండాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరు పోరాడినా తాము మద్దతునిస్తామని వారు ప్రకటించారు. తమ్మినేని వీరభద్రం పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తమ్మినేని పాదయాత్ర కొనసాగే గ్రామాలలో ఆయనకు స్వాగతం పలకడానికి టీడీపీ శ్రేణులు కూడా సిద్దం కావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా తాము చేప‌ట్ట‌నున్న‌ ఉద్యమాలకు కూడా అన్ని పార్టీల నుంచి మద్దతును కోరుతామని, అందరితో కలిసి ప్రజాకంటక పాలనను అంతమొందించడానికి కృషి చేస్తామని రావుల‌ - రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/