Begin typing your search above and press return to search.

వెనక్కితగ్గిన దినకరన్​ .. చిన్నమ్మ సూచనతోనేనా..!

By:  Tupaki Desk   |   16 March 2021 6:15 AM GMT
వెనక్కితగ్గిన దినకరన్​ .. చిన్నమ్మ సూచనతోనేనా..!
X
అమ్మ మక్కల్​ మున్నేట్ర కళగం నేత దినకరన్​ ఓ కీలక పిటిషన్​ను వెనక్కి తీసుకున్నారు. ఇంకా శశికళ మాత్రం ఓ పిటిషన్​ను వెనక్కి తీసుకోలేదు. ప్రస్తుతం ఈ అంశం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం.. శశికళ ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ టైంలోనే ఆమె మేనల్లుడు దినకరన్​ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇదిలా ఉంటే అప్పట్లో శశికళ సీఎం అవుదామని కలలు గన్నారు. కానీ ఆమె కలలు కల్లలయ్యాయి. అవినీతి కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యారు. తన అనుచరుడు పళని స్వామిని సీఎం కుర్చీ మీద కూర్చొబెట్టినప్పటికీ వివిధ కారణాల వల్ల అతడు కూడా చిన్నమ్మకు ఎదురుతిరిగాడు. చివరకు ప్రధాన కార్యదర్శి అనే పదవినే రద్దు చేశారు. శశికళను పార్టీ నుంచి సస్పెండ్​ చేసి.. ఆమెను దూరం చేశారు.

ఆ తర్వాత దినకరన్​ అమ్మ మక్కల్​ మున్నేట్ర కళగం అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి రద్దు కావడంతో దీనిని వ్యతిరేకిస్తూ శశికళ, దినకరన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ మూడేళ్లుగా మద్రాసు హైకోర్టులో విచారణ సాగింది. ఆ తర్వాత ఈ కేసును ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. మరోవైపు ఈ పిటిషన్‌ను రద్దు చేయాలంటూ అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరుసెల్వం, కో– కన్వీనర్‌ పళనిస్వామి, ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ రిట్‌ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్లన్నీ ప్రత్యేక కోర్టు ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా దినకరన్​ తరఫు న్యాయవాది తాము ఈ కేసు నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుతం తన క్లయింట్​ అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ఏర్పాటు చేసి ఆపార్టీకి ప్రధాన కార్యదర్శి గా ఉన్నందున ఈ పిటిషన్​ ను ఉప సంహకరించుకుంటున్నట్టు కోర్టుకు విన్నవించారు.ఈ కేసు లో మరో పిటిషనర్‌ కూడా ఉన్నారని, వారి అభిప్రాయం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. ఏప్రిల్​ 9 లోగా శశికళ తన అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని కోర్టు సూచించింది.