Begin typing your search above and press return to search.

అమ్మ పార్టీలో చీలిక‌..పార్టీ ప్ర‌క‌టించిన దిన‌క‌ర‌న్‌

By:  Tupaki Desk   |   5 Aug 2017 10:08 AM GMT
అమ్మ పార్టీలో చీలిక‌..పార్టీ ప్ర‌క‌టించిన దిన‌క‌ర‌న్‌
X
త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ముఖ్యంగా దివంగ‌త జ‌య‌ల‌లిత అభిమానులు క‌ల‌వ‌రపాటుకు గురి చేసే వార్త‌. అమ్మనేతృత్వం వ‌హించిన‌ రెండాకుల గుర్తుగ‌ల అన్నాడీఎంకే నిట్ట‌నిలువునా చీలింది. ఇప్ప‌టికే మూడు గ్రూపులుగా చీలిన ఆ పార్టీ నుంచి అధికారికంగా చిన్న‌మ్మ సోద‌రి వ‌నితామ‌ణి కుమారుడు దిన‌క‌రన్ వేరుప‌డి త‌న సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్నాడీఎంకే వర్గాలు రెండు నెలల్లో విలీనం కావాలంటూ గడువు విధించిన టీటీవీ దినకరన్ అది సమీపించడంతో ఈ నెల 5న అన్నాడీఎంకే కార్యాలయంలో అడుగుపెడతానని, పార్టీ శ్రేణులు అక్కడికి రావాలని పిలుపు ఇచ్చారు. అయితే రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది.

శుక్ర‌వారం రాత్రి దిన‌క‌ర‌న్ త‌న సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అన్నాడీఎంకే పురట్చి తలైవీ అమ్మ పేరవై పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి త‌న వ‌ర్గం వారంద‌రికీ ప‌ద‌వులు ఇచ్చారు. ఈ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి బృందంలోని వారికి కూడా ప‌ద‌వులు ఇచ్చి క‌ల‌క‌లం సృష్టించారు. అమ్మ వ‌ర్గంలోని 64 మంది అనుచ‌రులను గౌర‌వించి ముఖ్య ప‌ద‌వులు ఇచ్చారు. ప‌ళ‌నిస్వామి టీంలోని మ‌హిళా ఎమ్మెల్యేలైన స‌త్య ప‌న్నీర్ సెల్వం, ఉమామ‌హేశ్వ‌రి, చంద్ర‌ప్ర‌భ‌, జ‌యంతి ప‌ద్మ‌నాభంకు ప‌ద‌వులు క‌ట్టబెట్ట‌డం ద్వారా ముఖ్య‌మంత్రికి షాకిచ్చారు. అదే స‌మ‌యంలో ఏకంగా 15 మంది ఎమ్మెల్యేల‌కు కీల‌క విభాగాల‌కు కార్య‌ద‌ర్శులుగా ప్ర‌క‌టించారు. 18 విభాగాలు ఏర్పాటుచేసిన వాటిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స‌హా త‌న బంధువులైన ఇళ‌వ‌ర‌సి, నాంజిల్ సంప‌త్‌ల‌ను నియ‌మించారు. మ‌రోవైపు ఈనెల 14వ తేదీనుంచి రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్టారు.

కాగా, ఈ నిర్ణ‌యానికి ముందు బెంగళూరు అగ్రహారం జైల్లో శశికళను కలిశారు. ఆ స‌మ‌యంలో తన వెంట 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. టీటీవీ దినకరన్‌ దూకుడు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా వెల్లడైన అభిప్రాయాలతో దినకరన్‌ను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఒక స్పష్టత వచ్చిందని స‌మాచారం.