Begin typing your search above and press return to search.

బాబువి మొద్ద‌బ్బాయి పాఠాలంట‌

By:  Tupaki Desk   |   8 Oct 2016 11:40 AM GMT
బాబువి మొద్ద‌బ్బాయి పాఠాలంట‌
X
తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతుల్లో చంద్రబాబు సూచనలు ర్యాంకు రాని మొద్దబ్బాయి పాఠాలు చెప్పినట్లున్నాయని ఏపీసీసీ ఉపాధ్యక్షులు ఎన్‌ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడలోని కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు నెలల క్రితం చంద్రబాబు ఇదే విధంగా ర్యాంక్‌ల తెలిపినప్పుడు, చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా 42వ ర్యాంక్‌ లో ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలుండగా ఆ ఆరుగురిలో కూడా చంద్రబాబుది అప్పట్లో నాలుగో స్థానమని తుల‌సిరెడ్డి గుర్తు చేశారు. సొంత ర్యాంక్ చ‌క్క‌దిద్దుకోలేని చంద్రబాబు ఇత‌రుల‌కు ర్యాంక్‌లు మెరుగు పరచుకోవాలంటూ పాఠాలు చెప్పటం విడ్డూరమేనని తుల‌సిరెడ్డి వ్యాఖ్యానించారు.

అవినీతిపై చర్యలు తీసుకుంటానని టీడీపీ మేధో మథనంలో చంద్రబాబు చెప్పడంపై ఆ పార్టీ కార్యకర్తలే నవ్విపోతున్నారని తుల‌సి రెడ్డి అన్నారు. పెద్ద బాబుతో పనవ్వాలంటే చినబాబుకి కమిషన్లు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు - కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు దృష్టిలో సన్‌ రైజ్‌ స్టేట్‌ అంటే తన 'సన్‌'ను అన్ని విధాలా 'రైజ్‌' చేయడమేనన్నారు. ఈ నెల 15 నుంచి టీడీపీ చేపట్టబోయేవి జన వంచన యాత్రలే కాగలవని తులసిరెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ - రాష్ట్రంలో టీడీపీ ప్రజలను అన్ని విధాలా మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఇకనైనా టీడీపీ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పి రాష్ట్రాభివృద్ధికి పాటు పడాలని తుల‌సిరెడ్డి సూచించారు.

ఈ కామెంట్లుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్టమ నాయుడు స్పందించారు. మూడు రోజుల పాటు జరిగిన టీడీపీ శిక్షణ తరగతుల ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ శిక్ష‌ణ వ‌ల్ల ప్రజా ప్రతినిధులు తమ పని తీరును మెరుగుపరచుకోగల్గుతారన్నారు. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేయడానికి అవకాశముందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న సోనియా గాంధీ - రాహుల్‌ గాంధీ - మన్మోహన్‌ సింగ్‌ - జైరాం రమేష్‌ పార్లమెంట్‌ లోనే ఉన్నారని, వాళ్ల పట్టు పట్టి ప్రత్యేక హోదా ఇప్పిస్తే ఎవరు వద్దంటారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు విదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని గాలి ముద్దుకృష్ణ‌మ‌ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/