Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ- వైసీపీ పొత్తు!!

By:  Tupaki Desk   |   9 July 2017 9:55 AM GMT
వచ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ- వైసీపీ పొత్తు!!
X
కేంద్రంలో - రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించాయ‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఏపీపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్రదేశ్ వాసుల‌కు ఎంతో మేలు చేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన తెలుగుదేశం - బీజేపీలు అధికారంలో వ‌చ్చిన వాటిని తుంగ‌లో తొక్కాయ‌ని ఆరోపించారు. రెండు పార్టీలు త‌మ స్వ‌లాభం త‌ప్ప ప్ర‌జా సంక్షేమం గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కడప జిల్లా వేంపల్లెలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ-బీజేపీ బిజెపి మూడేళ్ల పాలనపై ఛార్జ్ షీట్ పుస్తకాన్ని తుల‌సిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మిత్ర‌ప‌క్షాల‌తో పాటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీపై సైతం విరుచుకుప‌డ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ ఒకరికొకరు పోటీ పడుతున్నారని తుల‌సిరెడ్డి ఆరోపించారు. చట్టసభల సాక్షిగా ప్రధానమంత్రి హోదాలో రాష్ట్ర విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా కల్పించిన ప్రత్యేక హోదాను ఈ రెండు పార్టీలు క‌లిసి తుంగలో తొక్కాయ‌ని మండిప‌డ్డారు. త‌న స్వార్థ రాజ‌కీయాల కోణంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ప్ర‌త్యేక హోదా కోసం పెద‌వి విప్ప‌డం లేద‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లో ప్రభుత్వ ధనం వృథా, రాజధాని పేరుతో భూముల కుంభకోణం - నీటి పారుదల ప్రాజెక్టుల అంచనా పెంపు, ప్రజా ప్రతినిధుల కొనుగోళ్లు వంటివి త‌ప్ప ప్ర‌జాసంక్షేమం మ‌చ్చుకైనా లేద‌న్నారు. ఇలా చంద్రబాబు నెలకొల్పిన మూడేళ్ల చెత్త రికార్డు ప్రజాస్వామ్మానికే మాయని మచ్చ అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ డైరక్షన్ లో బీజేపీ - టీడీపీ - వైసీపీలు పొత్తు పెట్టుకొని పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోందని తుల‌సి రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ పార్టీ - బీజేపీ గాడ్సేయ పార్టీ అని తుల‌సిరెడ్డి అన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ వెంట న‌డిచేందుకు టీడీపీ - వైసీపీలు ఆరాట‌ప‌డుతున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ కంటే కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌ర్చిన విప‌క్షాల అభ్య‌ర్థి మీరా కుమార్‌ వంద రెట్లు మేల‌ని ఆయ‌న అన్నారు.