Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఇన్ ఛార్జిగిరీ తుమ్మలకు నచ్చలేదా?

By:  Tupaki Desk   |   23 April 2016 11:29 AM GMT
కేటీఆర్ ఇన్ ఛార్జిగిరీ తుమ్మలకు నచ్చలేదా?
X
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో టీఆరెస్ పోటీకి నిలిపిన సంగతి తెలిసిందే. అయితే... ఆ ఎన్నికలకు ఇన్ ఛార్జిగా మరో మంత్రి కేటీఆర్ ను నియమించడం తుమ్మలకు మింగుడుపడడం లేదట. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే మొత్తం క్రెడిట్ కేటీఆర్ ఎత్తుకుపోతాడని ఆయన టెన్షన్ పడుతున్నారట. దీంతో కేటీఆర్ కు వ్యతిరేకంగా తుమ్మల అక్కడక్కడా అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తాజాగా మీడియా ముందు కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం టీఆరెస్ లో కేటీఆర్ హవా మామూలుగా లేదు. చివరకు హరీశ్ రావు కూడా కేటీఆర్ ఎదురుగా తగ్గి ఉండాల్సి వస్తోంది. సీనియరు నేతలు కూడా కేటీఆర్ ను తప్పనిసరిగా భరించాల్సి వస్తోంది. అదేసమయంలో కేటీఆర్ కూడా ప్రతి అంశంలో విజయం సాధిస్తూ ఆ స్థాయికి తాను తగినోడినే అని నిరూపించుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఆయన రేంజిని ఎక్కడికో తీసుకెళ్లాయి. కేసీఆర్ కు ఆయనే వారసుడని పార్టీలో బలంగా ప్రచారమవుతోంది. అలాంటి కేటీఆర్ ను కేసీఆర్ వారసుడిగా తాను సమర్థించలేనని తుమ్మల అంటున్నారు. తాను కేసీఆర్ కే బద్ధుడినని.. ఆయన పక్షాన, టీఆరెస్ పక్షాన ఉంటానే కానీ, ఇతరులకు ప్రాధాన్యమివ్వనని అన్నారు. తన వారసులనే తాను ప్రమోట్ చేసుకోవడం లేదని... అలాంటప్పుడు ఇంకెవరిదో వారసత్వం గురించి నేనెలా మాట్లాడుతానని కూడా మీడియాతో అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు టీఆరెస్ లో కలకలం రేపుతున్నాయి. పాలేరులో కేటీఆర్ బాధ్యతలు తీసుకోవడాన్ని ఇష్టపడకపోవడం వల్లే తుమ్మల అలా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

ఖమ్మం జిల్లాలో తుమ్మల టీడీపీ నుంచి టీఆరెస్ లో చేరిన తరువాత అక్కడ టీఆరెస్ బలపడింది. విజయాలు సాధిస్తోంది. అదంతా తన ఘనతే తప్ప వేరే ఏమీ కాదని తుమ్మల భావిస్తున్నారు. అలాంటిది, చివరకు తాను పోటీ చేస్తున్న ఎన్నికల బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించి తనకు క్రెడిట్ రాకుండా చేయాలని భావిస్తున్నారని తుమ్మల అనుకుంటున్నారట. అందుకే కేటీఆర్ ప్రెజెన్సును ఆయన సహించడం లేదని టాక్.

కేటీఆర్ ను ఎదిరిస్తూ తుమ్మల మాట్లాడడం సంగతి పక్కన పెడితే ఇలా అహాలకు పోయి సమన్వయం లేకుండా చేసుకుంటూ చివరకు తుమ్మల మరోసారి ఓడిపోయే పరిస్థితి రావొచ్చు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త.