Begin typing your search above and press return to search.

బాబును తుమ్మల బీట్ చేశారా?

By:  Tupaki Desk   |   21 July 2015 9:55 AM GMT
బాబును తుమ్మల బీట్ చేశారా?
X
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరిపుష్కరాలకు సంబంధించి ఆసక్తికరమైన వాదన రాజకీయ వర్గాల్లో సాగుతోంది. విభజన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాల్ని రెండు తెలుగు రాష్ట్రాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అవతలి వారి కంటే తమదే పైచేయిగా ఉండాలన్న తపనతో రెండు రాష్ట్రాలు కసిగా పని చేస్తున్నాయి. అయితే.. ఏపీలో రాజమండ్రి తొక్కిసలాట ఘటనతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. 27 మంది భక్తులు మృతువాత పడటం.. అందుకు బాబే కారణమంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. జరిగింది తప్పు అని.. తనను క్షమించాలని చంద్రబాబు నాయుడు స్వయంగా చెంపలేసుకున్నారు.

తన పాలనా వైఫల్యం కారణంగా చోటు చేసుకున్న విషాదానికి ప్రతిగా బాబు.. పుష్కరాలు జరిగినంత కాలం రాజమండ్రిలో ఉంటానని చెప్పి.. నిత్యం పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా రోజుకు మూడు గంటలు కూడా విశ్రాంతి తీసుకోకుండా బాబు పని చేస్తున్నప్పటికీ.. పుష్కరాల మొదటిరోజు చోటు చేసుకున్న తొక్కిసలాటకు సంబంధించిన మరక ఆయన్ను వదిలిపోని పరిస్థితి. దీంతో.. ఎవరు బాగా చేశారన్న పోటీ లేనే లేదని.. తెలంగాణ విజేతగా నిలిచిందన్న వాదన వినిపిస్తోంది.

ఇక.. ఇప్పటివరకూ జరిగిన పుష్కరాలకు సంబంధించి చూస్తే.. తెలంగాణలో పలువురు మంత్రులు పుష్కరాల్ని పర్యవేక్షిస్తున్నా.. అందరి కంటే మార్కులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకే అని చెబుతున్నారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో గోదావరి పుష్కరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. నీళ్లు లేని కారణంగా పలు జిల్లాలో ఓ మోస్తరు భక్తులు మాత్రమే వెళుతున్న పరిస్థితి.

అందుకు భిన్నంగా.. ఖమ్మం జిల్లా భద్రాచలంలో మాత్రం పుష్కరాల మొదటి రోజును నుంచి భక్తులు పోటెత్తతున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రం ఉండటంతో మరింత కలిసి వచ్చింది. లక్షలాదిగా భక్తులు వస్తున్నప్పటికీ.. ఎలాంటి తప్పు దొర్లకుండా తుమ్మల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారని చెబుతున్నారు. పలు సందర్భాల్లో ట్రాఫిక్ జాం చోటు చేసుకుంటే.. స్వయంగా తుమ్మల బుల్లెట్ వేసుకొని మరీ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసిన పరిస్థితి నెలకొంది.

మరో మంత్రి హరీశ్ ను వెంట బెట్టుకొచ్చిన తుమ్మల.. తానే బుల్లెట్ నడిపి ట్రాఫిక్ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. అంతేకాదు... వీఐపీల కారణంగా రద్దీ మరింత పెరుగుతోందని.. వారికి భద్రతా ఏర్పాట్లలోఏదైనా లోపం జరిగే వీలుందని భావించిన తుమ్మల.. భద్రాచలంకు వీఐపీలు ఎవరూ రావొద్దంటూ బహిరంగ ప్రకటన చేశారు. ఈ కారణంగానే.. షెడ్యూల్ ప్రకారం గవర్నర్ భద్రాచలంలో స్నానం చేయాల్సి ఉన్నా.. తుమ్మల ప్రకటన కారణంగా గవర్నర్ భద్రాచలం కాకుండా మోతె వెళ్లారని చెబుతారు. మొత్తంగా చూస్తే పుష్కరాల ఏర్పాట్ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలిస్తే తెలంగాణ మంత్రి తుమ్మల చాలా బెటర్ అన్న వాదన వినిపిస్తోంది.