Begin typing your search above and press return to search.

పాలేరు టీఆర్ ఎస్ అభ్యర్థిగా తుమ్మల ఫైనల్

By:  Tupaki Desk   |   21 April 2016 4:31 AM GMT
పాలేరు టీఆర్ ఎస్ అభ్యర్థిగా తుమ్మల ఫైనల్
X
తనదైన నిర్ణయాలతో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు షాకులిచ్చే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన తీరును ప్రదర్శించారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి.. తనకు అత్యంత సన్నిహితుడైన తుమ్మల నాగేశ్వరరావును ఎంపిక చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత.. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ అయిన రామిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో తాజా ఉప ఎన్నిక రావటం తెలిసిందే.

పాలేరు ఉప ఎన్నికను రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఇస్తూ.. ఎన్నికను ఏకగ్రీవం చేయాలని తపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ.. పాలేరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావటంతో ఫాంహౌస్ నుంచి నగరానికి తిరిగి వచ్చిన కేసీఆర్.. పార్టీ నేతలతో వరుస భేటీ నిర్వహించారు. తుమ్మలతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన.. చివరకు పాలేరు అభ్యర్థిగా తుమ్మల బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు.

అంతేకాదు.. ఈ ఎన్నిక బాధ్యతను మంత్రి కమ్ తన కుమారుడైన కేటీఆర్ కు అప్పజెబుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. పాలేరు ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై నెలకొన్న ఊహాగానాలకు కేసీఆర్ తెర దించినట్లైంది. తుమ్మల నేతృత్వంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతారన్న వాదనకు భిన్నంగా.. ఏకంగా మంత్రి తమ్మలనే బరిలోకి దింపటం చూస్తే.. ఈ ఉప ఎన్నికతో ఖమ్మం జిల్లాలో టీఆర్ ఎస్ పట్టు ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని కేసీఆర్ చాటి చెప్పాలనుకున్నట్లుగా అర్థమవుతోంది.