Begin typing your search above and press return to search.

రోజూ జరిగే పంచాయితీలేంది తుమ్మల?

By:  Tupaki Desk   |   23 April 2016 4:44 AM GMT
రోజూ జరిగే పంచాయితీలేంది తుమ్మల?
X
రాష్ట్రాలుగా రెండు తెలుగు ప్రాంతాలు విడిపోయినా.. వాటి మధ్యన ఎలాంటి వివాదాల్లేవా? వివాదం అంటే జల వివాదం మాత్రమేనా? జల వివాదం లేకుంటే అసలేం వివాదాలేనట్లేనా? ఇలాంటి చిత్రమైన డౌట్లు వచ్చేలా మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆ మధ్యన నాగార్జున సాగర్ దగ్గర నీళ్ల కోసం రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవటం.. ఇష్యూ మరింత ముదరకుండా ఉండేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలగజేసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావటం తెలిసిందే. ఆ రోజున చంద్రబాబు కానీ బిగుసుకుపోయి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో? ఇదొక్కటే కాదు.. కృష్ణా నీటి విడుదల కోసం.. శ్రీశైలం వద్ద నీళ్ల పంచాయితీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్నదే.

నిజానికి ఇదొక్కటే కాదు.. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల పంచాయితీ లెక్క చాలానే ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపించినా.. ఏ రోజున ఎలాంటి వివాదం తలెత్తుతుందో చెప్పలేని పరిస్థితి. ఏ ప్రాజెక్టు మాటేమిటో ఎందుకు.. పోలవరం ప్రాజెక్టు మీద తెలంగాణ వైఖరి తెలియంది కాదు.

అయితే.. ఇలాంటివేమీ గుర్తు లేనట్లుగా మాట్లాడుతున్నారు తెలంగాణ మంత్రి తుమ్మల. జరిగిపోయిన విషయాలు గుర్తుంచుకోవటం ఆయనకు అలవాటు లేనట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి జల పంచాయితీలు లేవని చెబుతున్న ఆయన.. రాస్ట్రాలుగా విడిపోయిన రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు లేవని తేల్చటం గమనార్హం.

జల వివాదాల్ని పక్కన పెడితే.. నిత్యం ఏదో ఒక విభజన పంచాయితీ రెండు రాష్ట్రాల మధ్యన నెలకొందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఉన్నత విద్యా మండలి.. ఉద్యోగుల పంపిణీ.. వివిధ శాఖల మధ్య ఆస్తుల పంపిణీ.. విద్యుత్ ఉద్యోగులు.. ఇలా చెప్పుకుంటూ పోతే రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీలకు కొదవలేదు.

అయితే అలాంటివేమీ లేనట్లుగా తుమ్మల మాట్లాడిన మాటల్ని వింటే.. తుమ్మల ఎందుకలా మాట్లాడారు? అన్న ప్రశ్న వేసుకొని.. ఆయన మాట్లాడిన ప్లేస్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెంకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏపీ గాలి తగలటంతో తెలంగాణ మంత్రి నోటిమాట ఎంతలా మారిందా? లేక.. ఏపీ నుంచి పోలవరం ఐదు ముంపు గ్రామాల్ని తెలంగాణలోకి తీసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి ‘వివాదరహిత’ వ్యాఖ్యలు తుమ్మల నోటి నుంచి వచ్చి ఉంటాయా?