Begin typing your search above and press return to search.

తుపాకీ స్పెషల్: ఒక్క ఏపీలోనే కాదు ప్రపంచమంతా ఇసుక కొరత ఉంది తెలుసా?

By:  Tupaki Desk   |   21 Nov 2019 5:56 AM GMT
తుపాకీ స్పెషల్: ఒక్క ఏపీలోనే కాదు ప్రపంచమంతా ఇసుక కొరత ఉంది తెలుసా?
X
కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారిన ఇసుక కొరత వ్యవహారం నాలుగైదు రోజులుగా చల్లబడింది. వరదలు, నదులు ఉప్పొంగుతుండడంతో ఇసుక లభ్యత లేదని పాలక పక్షం... ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ పనులు జరగక కార్మికులరకు పనిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. అయితే, ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకునే వీలు కల్పించి ధరలను అదుపులో ఉంచుతూ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఇసుక కొరత ఒక్క ఏపీలోనే ఉందా.. దేశంలోని ఇంకే రాష్ట్రంలోనూ లేదా... అసలు భారత్ కాకుండా మిగతా దేశాల్లో ఇసుక పరిస్థితి ఏంటన్నది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు ఇసుక సమస్యతో సతమతమవుతున్నాయని.. ఇతర దేశాల్లోనూ ఇసుక పెద్ద సమస్యగా మారిందని అర్థమైంది. అంతేకాదు.. ఇసుకకు అంత డిమాండ్ ఏర్పడడానికి కారణాలు పరిశీలిస్తే భవిష్యత్తులోనూ ఇసుక బంగారమేనని తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా నీటి తర్వాత అత్యధికంగా వినియోగంలో ఉన్న సహజ వనరు ఇసుకే. ఏటా దాదాపు 5 వేల కోట్ల టన్నుల కంకర, ఇసుక మిశ్రమాన్ని జనాలు వినియోగిస్తున్నారు. 5 వేల కోట్ల టన్నులంటే ఇసుకంటే ఎంతో ఊహించగలరా.. ఆ ఇసుకతో ఏకంగా బ్రిటన్ వంటి దేశాలను కనిపించకుండా కప్పేయొచ్చు.. అంత ఇసుక వినియోగంలో ఉంది ప్రపంచంలో.

ఒక వైపు విస్తారంగా సముద్ర తీరాలు.. లక్షల కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ఎడారులు ఉన్నా కూడా ఇసుక కొరతేంటన్న అనుమానం రావొచ్చు. కానీ, సముద్రం ఇసుక, ఎడారి ఇసుక అన్ని పనులకూ పనికి రాదు. నదులు, వాగులు, సరస్సుల్లో ఉండే ఇసుకే భవన నిర్మాణాలకు పనికొస్తుంది. అందుకే ఆ ఇసుకకే డిమాండ్.. కానీ, వాతావరణ పరిస్థితులు, పర్యావరణ నిబంధనల కారణంగా ఇటీవల కాలంలో ఇసుక ఏడాది పొడవునా దొరకడం లేదు.

సముద్రపు ఇసుక బాగా చిన్నరేణువులగా ఉంటూ మృదువుగా ఉంటుంది. ఇది భవన నిర్మాణం కోసం వినియోగించే కాంక్రీటు మిశ్రమంలో వాడేందుకు పెద్దగా ఉపయోగపడదు. ఎడారి ఇసుక కూడా అంతే. నిర్మాణాల కోసం వినియోగించే ఇసుక వాగుల్లో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో ఉండే సరస్సుల్లో దొరుకుతుంది. దీనిలోని ఇసుక రేణువులు కోణీయంగా ఉంటాయి. ఈ ఇసుకకు డిమాండ్ తీవ్రంగా పెరగింది. ప్రపంచవ్యాప్తంగా వాగులు, నది తీరాలు, సరస్సుల నుంచి ఇసుక మొత్తం ఖాళీ అవుతోంది. చాలా దేశాల్లో ఇదో పెద్ద వ్యాపారంగా మారి ముఠాలు ఇసుక దందాలు చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇసుక వినియోగం పెరగడానికి శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణే కారణం. గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిపోతున్నవారి సంఖ్య ఏటేటా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. మానవ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంతో నగరాలు విస్తరిస్తున్నాయి. దాంతో ఆవాసాలు అవసరమవుతున్నాయి. నిర్మాణాలు పెరుగుతున్నాయి. ఇసుక అవసరం పెరుగుతోంది.

ఏ రాష్ట్రంలో ఎలా ఉంది?
భారత్‌లో ఈ ఏడాది వర్షాలు, వరదలు కారణంగా మధ్యప్రదేశ్, బిహార్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో తీవ్రమైన ఇసుక కొరత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌నూ తీవ్రమైన ఇసుక కొరత వేధిస్తోంది.

ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇసుక లభ్యత ఉన్నప్పటికీ రవాణా సదుపాయాలు అంతగా లేకపోవడం, మావోయిస్టు సమస్య వల్ల అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కావడం లేదు.

ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో ఇసుక లభ్యత బాగానే ఉంది. కొరత ప్రభావం తక్కువగా ఉంది.

తెలంగాణలో ఇసుకకు గిరాకీ, ధర ఉన్నప్పటికీ లభ్యతకు ఢోకా లేకుండా ఉంది. అక్కడ నుంచి మహారాష్ట్రలోని నగరాలకు ఎగుమతి అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌, గుజరాత్, దిల్లీ, హరియాణా ప్రాంతాల్లో రాక్ సాండ్ వినియోగం పెరుగుతుండడంతో మామూలు ఇసుక కొరత ప్రభావం కనిపించడం లేదు.

ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాలతో పోల్చితే నిర్మాణాలు తక్కువగా ఉండడం.. నిర్మాణాల్లో కలప వినియోగం ఎక్కువగా ఉండడంతో అక్కడ ఇసుక సమస్య లేదు.

పంజాబ్‌లో ఇసుక విస్తారంగా దొరుకుతోంది. అక్కడి నుంచి పరిసర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండడంతో దిల్లీ, దాని ఎగువ రాష్ట్రాల్లో కొరత కనిపించడం లేదు.

ఏ దేశంలో పరిస్థితి ఎలా ఉంది?
అనేక దేశాల్లో సముద్రంలో ఇసుక, నదులు, వాగుల్లో ఇసుక తవ్వడం వల్ల ఇసుక నిల్వలు తగ్గిపోయాయి. మరికొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటున్నాయి. కొన్ని దేశాలు కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకోవడానికి, మరికొన్ని భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుకను విరివిగా ఉపయోగిస్తుండడంతో కొరత ఏర్పడుతోంది. 1985 నుంచి ప్రపంచవ్యాప్తంగా 13,563 చదరపు కి.మీ.ల కృత్రిమ నేల ఏర్పడినట్లు ఓ డచ్ పరిశోధక బృందం లెక్కగట్టింది.

* ఆస్ట్రేలియా నుంచి ఇసుకు దిగుమతి చేసుకుంటున్న దుబాయ్
2000 సంవత్సరం తర్వాత భారత్‌లో నిర్మాణాల కోసం ఇసుక వినియోగం మూడు రెట్లు పెరిగింది. ఇంకా పెరుగుతోంది కూడా. 20వ శతాబ్దం మొత్తంలో అమెరికా వినియోగించిన దానికన్నా ఎక్కువ ఇసుకను ఒక్క చైనా దేశమే గత పదేళ్లలో ఉపయోగించిందని ఓ అంచనా. భారీ ఎడారి పక్కనే ఉండే దుబాయ్‌ కూడా ఆస్ట్రేలియా నుంచి ఇసుక దిగుమతి చేసుకుంటోంది.

* నైజీరియాలో..
కృత్రిమంగా నేలను సృష్టించేందుకూ పలు దేశాల్లో ఇసుకను వాడుతున్నారు. సముద్రంలో అడుగున ఉండే ఇసుకను పెద్ద పెద్ద ఓడల ద్వారా తవ్వి, తీర ప్రాంతాల్లో కొత్తగా నేలను సృష్టిస్తున్నారు. దుబాయ్‌లో పామ్ ట్రీ ఐలాండ్స్‌ను ఇలాగే సృష్టించారు.
నైజీరియాలోని లాగోస్ తీరంలో 9.7 చదరపు కి.మీ.ల నేలను ఇలాగే ఏర్పాటు చేశారు.

* చైనాలో..
చైనా కూడా తీరంలోని వందలాది మైళ్లను నేలగా మార్చేసింది. ద్వీపాలను, వాటిలో విలాసవంతమైన రిసార్ట్‌లను నిర్మించింది.

* సింగపూర్‌లో..
సింగపూర్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఇసుకతో 40 ఏళ్లలో 130 చదరపు కి.మీ.ల భూభాగాన్ని సృష్టించుకుంది.

* వియత్నాంలో..
వియత్నాంలోని ఇసుకను విపరీతంగా తవ్వడంతో అక్కడి మీకాంగ్ డెల్టాలో ఇసుక దాదాపు కనుమరుగైపోయింది.

అనేక శతాబ్దాలుగా మధ్య ఆసియాలోని పర్వతాల్లోంచి మీకాంగ్ నది ప్రవాహంలో ఇసుక కొట్టుకొస్తోంది. కానీ, కొన్నేళ్లుగా ఈ నదీ పరివాహక దేశాల్లో ఇసుక తవ్వకాలు విపరీతం కావడంతో ఇప్పుడు ఇసుకన్నది కనిపించడం మానేసింది. ఒక్క 2011 సంవత్సరంలోనే ఈ నది నుంచి 50 మిలియన్ టన్నుల ఇసుకను తవ్వేశారని తేలింది. మరోవైపు ఇదే సమయంలో మీకాంగ్ నది మీద ఇటీవలి కాలంలో ఐదు భారీ ఆనకట్టలు నిర్మించారు. చైనా, లావోస్, కంబోడియాలో మరో 12 ఆనకట్టలు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ డ్యాంల కారణంగా డెల్టా ప్రాంతానికి ఇసుక ప్రవాహం తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ ఇసుక కొరత పెరుగుతోంది.

* మయన్మార్‌లో..
మయన్మార్‌లోనూ ఇసుకకు గడ్డు పరిస్థితే. అక్కడి అయ్యర్‌వాడీ నది వెంబడి ఆనకట్టలు విపరీతంగా కట్టడం.. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పరిమితికి మించి తవ్వేయడంతో ఇసుక దొరకడం లేదు.

* ఘనా, తైవాన్, పోర్చుగల్‌లో ప్రమాదాలు
ఘనాలోని నదిలో ఇసుక భారీగా వెలికితీయడంతో కొండప్రాంత భవనాల పునాదులు దెబ్బతిని కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇసుక తవ్వకాల కారణంగా 2000లో తైవాన్‌లో ఒక వంతెన కూలిపోయింది. ఆ తర్వాత 2001లో పోర్చుగల్‌లోని ఒక వంతెన కూలడంతో బస్సు నదిలో మునిగిపోయి 70 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

నిర్మాణాలే కాదు సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ..
గాజుతో పాటు సోలార్ ప్యానెల్లు, కంప్యూటర్ చిప్స్ వంటి హైటెక్ ఉత్పత్తులను తయారు చేసేందుకు ఉపయోగించే స్వచ్ఛమైన సిలికా ఇసుకకు డిమాండ్ కూడా పెరుగుతోంది.

ఇసుకకు డిమాండ్ భారీగా పెరగడంతో చాలా ప్రాంతాల్లో నేర ముఠాలు దీని వ్యాపారంలోకి దిగాయి. అక్రమంగా తవ్వకాలు జరుపుతూ బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి.

ఇసుక చుట్టూ అక్రమాలు..
* లాటిన్ అమెరికా, ఆఫ్రికాలోని ఇసుక రీచ్‌లలో చిన్నారులను బానిసలుగా చేసుకుని వారితో బలవంతంగా పనిచేయిస్తున్నారు.
* దక్షిణ మెక్సికన్ రాష్ట్రం చియాపాస్‌లోని ఓ నదిలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన పర్యావరణ కార్యకర్త జోస్ లూయిస్ అల్వారెజ్ ఫ్లోర్స్ ఈ ఏడాది జూన్‌లో దుండగులు కాల్చి చంపారు.
* ఈ ఏడాది ఆరంభంలో, దక్షిణాఫ్రికాలో ఇద్దరు ఇసుక వ్యాపారుల మధ్య వివాదంలో తుపాకీ కాల్పులకు ఒకరు చనిపోయారు.
* గత కొన్నేళ్లలో ఇలా కెన్యా, గాంబియా, ఇండోనేషియాలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇండియాలో ఏం జరుగుతోంది..
భారత్‌లోనూ అనేక రాష్ట్రాల్లో ఇసుక మాఫియా దాడుల్లో వందల మంది గాయపడ్డారు, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
* ఇటీవల మన దేశంలోని రాజస్థాన్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో ఇద్దరు మైనర్లు చనిపోయారు, ఇద్దరు పోలీసు అధికారులు ఆసుపత్రి పాలయ్యారు.