Begin typing your search above and press return to search.

హ్యాట్సాఫ్‌: అయిన వారే వ‌దిలేస్తున్నా.. ఆప్తులవుతున్న యోధులు!

By:  Tupaki Desk   |   7 May 2021 7:31 AM GMT
హ్యాట్సాఫ్‌: అయిన వారే వ‌దిలేస్తున్నా.. ఆప్తులవుతున్న యోధులు!
X
క‌రోనా వ‌చ్చింద‌ని తెలిసి.. క‌న్న‌త‌ల్లినే ఊరికిదూరంగా వ‌దిలేసిన కుమారులు`

`క‌రోనా పాజిటివ్ రావ‌డంతో వృద్ధుడుని ఆసుప‌త్రి వ‌ద్ద వ‌దిలేసిన బంధువులు`

`క‌రోనా సోక‌డంతో అద్దెఇంట్లోకి రానివ్వ‌ని య‌జ‌మాని`

- ఇవీ.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తున్న మాట‌లు, పేప‌ర్లు, మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు. వ్య‌క్తుల మ‌ధ్య బంధాల‌ను, అనుబంధాల‌ను, సంబంధాల‌ను క‌రోనా కాల్చేస్తోంది. కుటుంబాల‌కు కుటుంబాలే క‌కావిక‌లం అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కంటికి క‌నిపించ‌ని క‌రోనాతో పోరాడుతున్న వారు మ‌న‌వారే అయినా.. ఆ మ‌హ‌మ్మారి మ‌న‌ల్న‌ను ఎక్క‌డ చుట్టుముడుతుందో.. మ‌న ప్రాణాలు ఎక్క‌డ తీస్తుందో అనే ఆవేద‌న‌, ఆందోళ‌న‌.. అత్యంత సున్నిత‌మైన మాన‌వ సంబంధాల‌ను సైతం అతఃపాతాళానికి తొక్కేస్తున్న రోజులు కంటిముందు క‌నిపిస్తున్నాయి.


మ‌రి ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితిలో `మీవారులేకున్నా.. మేమున్నాం`-అంటూ.. ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌.. క‌రోనా బాధితుల‌కు అజ‌రామ‌ర సేవ‌లందిస్తున్నారు. వైర‌స్ విజృంభ‌ణ భారీస్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ.. క‌రోనా త‌మ‌ను సైతం వెంటాడుతుంద‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. ప్ర‌జాసేవే ప‌ర‌మార్థంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. క‌రోనా బాధితులకు కొండంత అండ‌గా నిలుస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌లో ముందువ‌రుస‌లో ఉన్న‌వారు.. వైద్యులు అయితే.. త‌దుప‌రి అనేక విభాగాల వారు.. ఇంత విపత్క‌ర స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు `మేమున్నా`మంటూ.. ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నారు. వీరంతా కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుపై పోరాడుతున్న తీరుకు దేశం యావ‌త్తు ముక్త‌కంఠంతో `హ్యాట్సాఫ్‌` చెబుతోంది.

వైద్యులు..
క‌రోనా వ‌చ్చిన వారి ఛాయ‌ల‌కు వెళ్లాలంటేనే మ‌న‌కు గుండెద‌డ‌! అలాంటిది క‌రోనా వ‌చ్చిన వారికి వైద్యం అందిస్తూ.. వారిని 24 గంట‌లూ క‌నిపెట్టుకుని ఉంటున్న వైద్యుల‌ది ఎన‌లేని సేవ. కుటుంబాల‌ను సైతం వ‌దిలిపెట్టి.. రోజులు, వారాల త‌ర‌బ‌డి ఆసుపత్రుల్లోనే ఉంటూ.. వారు క‌రోనా బాధితుల‌కు వైద్యం అందిస్తున్నారు. దైవం మానవ రూపంలో మారితే.. ఎలా ఉంటుందో వైద్యులే ప్ర‌త్యక్ష ఉదాహ‌ర‌ణ‌. కోలుకుంటున్న వారు కోలుకోగా.. ప్రాణాలు పోయేవారు కూడా ఉన్నారు. అయినా.. ఎంతో గుండెనిబ్బ‌రంతో క‌రోనాపై విజ‌యం సాధించేందుకు వైద్యులు చేస్తున్న కృషి శ్లాఘ‌నీయం.ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే.. క‌రోనా సోకిన వారికి వైద్యం చేస్తూ.. ఇప్ప‌టివ‌ర‌కు 150 మంది వైద్యులు.. రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందారు. అయినా కూడా వృత్తిప‌ట్ల అంకిత భావంతో వైద్యులు క‌రోనాను జ‌యించేందుకు కృషి చేస్తున్నారు.

పోలీసులు
క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు విధిస్తున్న లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ వంటివాటిని నిరంత‌రం ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తూ.. క‌రోనా ఫ్ట్రంట్ వారియర్స్‌గా నిలుస్తున్నారు పోలీసులు. నిజానికి గ‌త ఏడాది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 125 మంది వివిధ స్థాయిల పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అయిన ప్ప‌టికీ.. క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ.. ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు అలుపెరుగ‌ని శ్ర‌మ చేస్తున్నారు. రాత్రి, ప‌గ‌లు.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగులు
ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ఈ క‌రోనా స‌మ‌యంలో నిరంత‌రం సేవ‌లు అందిస్తున్నారు. నిజానికి ఒక్క స‌చివాల‌యంలోనే 15 మంది వ‌ర‌కు ప‌ర్మినెంట్‌, కాంట్రాక్టు ఉద్యోగులు క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పో యారు. ఈ క్ర‌మంలోనే వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వాల‌ని ఉద్యోగులు కోరుతున్నా.. ప్ర‌భుత్వం ఈ విష‌యంపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. అయిన‌ప్ప‌టికీ.. వారు మాత్రం ప్ర‌జాసేవ‌కు వెనుకాడ‌డం లేదు.

మెడిక‌ల్ టీం
ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో వైద్య సిబ్బంది సేవ‌లు ఎంత చెప్పుకొన్నా త‌క్కువే. 108, 104 స‌హా.. ఏఎన్ ఎంలు, న‌ర్సులు.. ఇలా అనేక రూపాల్లో వైద్య సేవ‌ల సిబ్బంది క‌రోనా బాధితుల‌కు అలుపెరుగ‌కుండా సేవ‌లు చేస్తున్నారు. నిజానికి వీరిలోనూ కొండంత భ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. విధి నిర్వ‌హ‌ణ‌లో వెన్ను చూప‌కుండా.. క‌రోనా అంతానికి కృషి చేస్తున్న తీరు న‌భూతో న‌భ‌విష్య‌తి!

వ్యాక్సినేష‌న్:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేష‌న్ సిబ్బంది.. కూడా క‌రోనాను జ‌యించేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. వ్యాక్సిన్ కేంద్రాల్లో వంద‌ల మందికి నిరంత‌రాయంగా సేవ‌లు అందిస్తున్నారు.

ఆప‌ద్బాంధ‌వులు!
క‌రోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఎన్నో రంగాల‌కు చెందిన వారు ఎంతో కృషి చేస్తూ.. త‌మ ఔన్న‌త్యాన్ని చాటుకుంటుంటే.. మ‌రికొన్ని వ‌ర్గాలు అస‌లు వెల‌క‌ట్ట‌లేని.. మాట‌ల‌కు కూడా అంద‌ని సేవ‌లు అందిస్తూ.. ఆప‌ద్బాంధ‌వులుగా నిలుస్తున్నారు. క‌రోనా కార‌ణంగా.. మ‌ర‌ణిస్తున్న‌వారి మృత‌దేహాల‌ను సొంత బంధువులే చూసేందుకు రాలేని రోజులు దాపురించాయి. ఇక‌, క‌డుపున పుట్టిన బిడ్డ‌లు, క‌ట్టుకున్న‌వారు సైతం.. మృత‌దేహాల‌కు అంతిమ సంస్కారాలు చేసేందుకు ముందుకు రావ‌డం లేదు. ఎక్క‌డ త‌మ‌కు కూడా క‌రోనా సోకుతుందోన‌న్న ఆవేద‌న‌.. వారిలోని ఆత్మీయ‌త‌కు, బంధానికి కూడా సంకెళ్లు వేస్తోంది.

ఇలాంటి స‌మ‌యంలో మేమున్నామంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యువ‌కులు కుల మ‌తాల‌కు అతీతంగా బృందాలుగా ఏర్ప‌డి.. స్వ‌చ్ఛంద అంత్య‌క్రియ‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అనాథ శ‌వాల‌తోపాటు.. క‌రోనా బాధిత వ్య‌క్తుల మృత‌దేహాల‌కు కూడా గౌర‌వ‌ప్ర‌ద‌మైన అంతిమ సంస్కారాలు నిర్వ‌హిస్తూ.. ``క‌డ సారి` వీడ్కోలు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. నిజానికి వీరికి కూడా క‌రోనా భ‌యం వెంటాడుతున్నా.. కానివారి కోసం.. ప్రాణాలకు తెగించి మ‌రీ.. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి వారు ఎంతో మంది.. స‌మాజ‌సేవ‌లో ఈ క‌రోనా స‌మ‌యంలో మేమున్నామంటూ.. భ‌ర‌త మాత రుణం తీర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వీరంద‌రికీ పేరుపేరునా `హ్యాట్సాఫ్‌`!!