Begin typing your search above and press return to search.

చంద్రుళ్లు.. ట్రిఫుల్ సెంచరీ పక్కానంట

By:  Tupaki Desk   |   23 Oct 2015 4:15 AM GMT
చంద్రుళ్లు.. ట్రిఫుల్ సెంచరీ పక్కానంట
X
మార్కెట్లో పప్పులు మండుతున్నాయి. రోజువారీగా అవసరమైన కందిపప్పు.. మినపప్పు ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పప్పుల దిగుబడి తగ్గటం.. ముందుచూపుతో వ్యవహరించి విదేశాల నుంచి పప్పుల్ని దిగుమతి చేసుకోవటంలో దొర్లిన తప్పులు.. సామాన్యులకు శాపాలుగా మారాయి. పది రోజుల క్రితం వరకూ కిలో కందిపప్పు రూ.160 నుంచి రూ.170 మధ్యలో ఉంటే.. ఇప్పుడు రూ.220 టచ్ చేయటం గమనార్హం.

ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్న పప్పుల ధరల్ని నియంత్రించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు విఫలమయ్యారన్న మాట బలంగా వినిపిస్తోంది. పెచ్చు పెరిగిపోయిన బ్లాక్ మార్కెట్ పుణ్యమా అని ధరలు రోజురోజుకీ మరింత పెరుగుతున్న దుస్ధితి. బడా హోల్ సేల్ వ్యాపారులు పప్పుల్ని కొనేసి.. వ్యూహాత్మకంగా కృత్రిమ కొరత సృష్టించి రోజురోజుకీ సెన్సెక్స్ మాదిరి పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.

వీరి కారణంగా ప్రస్తుతం డబుల్ సెంచరీ దాటిన పప్పుల ధరలు.. మరికొద్ది రోజుల్లో ట్రిఫుల్ సెంచరీ టచ్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదని చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కేజీ కందిపప్పు రూ.220 ఉంటే.. మినపగుళ్లు కేజీ రూ.200 (ఒకటో రకం) దాటిన దుస్థితి. దీనికి తోడు రోజురోజుకీ పెరుగుతున్న కృత్రిమ కొరత కారణంగా మార్కెట్లో పప్పులకు విపరీతమైన కొరత కనిపిస్తోంది.

బ్లక్ మార్కెటింగ్ మీద చంద్రుళ్లు దృష్టి సారించకపోవటంతో బడా వ్యాపారులు చెలరేగిపోతున్నారు. దీనికి తోడు.. కేంద్రం విదేశాల నుంచి తెప్పించిన పప్పుల్ని రాష్ట్రాలకు తెచ్చుకునే విషయంలో తెలంగాణ సర్కారుతో పోలిస్తే ఏపీ సర్కారు చాలావరకు బెటర్ అని చెప్పొచ్చు.

ఇప్పటికే కేంద్రం నుంచి వెయ్య టన్నుల పప్పుల్ని ఏపీ సర్కారు సేకరించింది. ఈ పప్పులపై ఎలాంటి పన్నులు లేకుండా కేంద్రం రాష్ట్రాలకు అందిస్తోంది. ఈ అవకాశాన్ని తెలంగాణ సర్కారు అందిపుచ్చుకోవాలని కోరుతున్నారు. మరో విషయం ఏమిటంటే.. బ్లాక్ మార్కెట్ విషయంలో చంద్రళ్లు కానీ కన్నెర్ర చేస్తే మొత్తం ఇష్యూ ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఇంత భారీగా పప్పుల ధరలు మార్కెట్లో పెరిగినప్పటికీ.. పండించిన రైతు ఏ మాత్రం ప్రయోజనం కలగకపోవటం. అంతేకాదు.. వీధి చివరన ఉండే కిరాణాషాపుల యజమానులు కూడా లాభం పొందని పరిస్థితి. మధ్యలోని దళారులు కోట్లాది రూపాయిలు కొల్లగొట్టేస్తున్నారు. అందుకే.. పప్పుల విషయంపై ఇద్దరు చంద్రుళ్లు ఒకచూపు చేస్తే.. పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం దొర్లినా.. దాని భారమంతా సామాన్య.. మధ్యతరగతి జీవులే భరించాల్సి వస్తోందన్న విషయాన్ని మర్చిపోకూడదు.