Begin typing your search above and press return to search.

పెళ్లి జ‌ర‌గాలంటే.. సైన్యం రావాల్సిందే!

By:  Tupaki Desk   |   4 Sep 2016 4:04 AM GMT
పెళ్లి జ‌ర‌గాలంటే.. సైన్యం రావాల్సిందే!
X
పెళ్లి అంటే ఎంత సంద‌డిగా ఉంటుంది! వంద‌ల సంఖ్య‌లో బంధువులు రావాలి. వీధంతా అదిరిపోయేలా ఇంటిని అలంక‌రించాలి. గానా బ‌జానా మోత మోగిపోవాలి. ఊరంతా మార్మోగిపోవాలి. అదీ షాదీ అంటే! ఈ మాత్రం హ‌డావుడి లేకుంటే పెళ్లిలో మ‌జా ఏముంటుంది చెప్పండీ..! క‌ల్యాణ మంట‌పంలో పెళ్లి జ‌రిగినా - ఇంట్లో జ‌రిగినా... వీధి వీధంతా పెళ్లి గురించే మాట్లాడుకునే స్థాయిలో హ‌డావుడి చేస్తాం క‌దా. పెళ్లికి పేద‌రికం ఏముంటుంది అన్న‌ట్టుగా అంద‌రూ హ‌డావుడి చేస్తారు. ఏ దేశంలోనైనా పెళ్లి అంటే హ‌డావుడి మామూలే క‌దా. కానీ, ఇప్పుడా దేశంలో పెళ్లికి ఇంత హంగామా ప‌నికి రాదు! పెళ్లిళ్లూ వేడుక‌లూ అంటూ హంగామా చేస్తే ఒప్పుకోరు.

ట‌ర్కీలో బ‌హిరంగంగా పెళ్లిళ్లు చేయ‌డాన్ని నిషేధించారు. హంగామాతో పెళ్లిళ్లూ ఇత‌ర వేడుక‌లు చేసుకోవడాన్ని నిషేధిస్తూ అక్క‌డి ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ ఎవ‌రైనా పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తీసుకోవాలి. అంతేకాదు, ఎలాంటి ఆర్భాటాల‌కు పోకుండా సౌండ్ లేకుండా ఇన్‌ డోర్ మంట‌పాల్లో పెళ్లి చేసుకోవాలి. పెళ్లి సంద‌డి బ‌య‌ట‌కి వినిపించ‌కూడ‌దు. వివాహ వేడుక వీధుల్లో క‌నిపించ‌కూడ‌దు! పెళ్లిళ్ల ప‌ట్ల ఇంత క‌ఠిన‌త్వం ఎందుకూ అనేగా మీ ప్ర‌శ్న‌!

ఇటీవ‌ల ట‌ర్కీలో పెళ్లి వేడుక‌ల‌ను టార్గెట్ చేసుకుంటూ ఉగ్ర‌వాదులు దాడుల‌కు దిగుతున్నారు. ఇటీవ‌లే ఇదే త‌ర‌హాలో జ‌రిగిన దాడిలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా తీవ్రంగా గాయ‌ల‌పాల‌య్యారు. కాబ‌ట్టి, భ‌ద్ర‌తా కార‌ణాలు దృష్ట్యా పెళ్లి వేడుక‌ల‌పై ఇలాంటి ఆంక్ష‌ల్ని విధించింది ప్ర‌భుత్వం. ఎవ‌రైనా పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ప్ర‌భుత్వం అనుమ‌తి తీసుకోవాలి. అప్పుడు ర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వం సాయుధ బ‌ల‌గాల‌ను పంపుతుంది. బ‌ల‌గాల ర‌క్ష‌ణ‌లో వీలైనంత త‌క్కువ హంగామాతో పెళ్లిళ్లు గుట్టు చ‌ప్పుడు కాకుండా జ‌ర‌గాల‌న్న‌ది ట‌ర్కీ ప్ర‌భుత్వం ఆదేశం.