Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి కెరీర్ లో అదే టర్నింగ్ పాయింట్

By:  Tupaki Desk   |   28 Jun 2021 3:30 PM GMT
రేవంత్ రెడ్డి కెరీర్ లో అదే టర్నింగ్ పాయింట్
X
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇంట ఓడి రచ్చ గెలిచాడు. రచ్చ గెలవడమే కాదు.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు సైతం అందుకునేదాకా ఎదిగాడు.. దీనికంతంటి కారణం ఏదో తెలుసా.? ‘మల్కాజిగిరి’ పార్లమెంట్ స్థానం. అవును.. తన సొంత ఊళ్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఈ స్థాయి చేర్చింది ఖచ్చితంగా మల్కాజిగిరి పార్లమెంట్ నే.

రేవంత్ రెడ్డి రాజకీయం మొత్తం ఇన్నాళ్లు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే సాగింది. వరుసగా అక్కడి నుంచే గెలుస్తూ వచ్చారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన రేవంత్ ను టీఆర్ఎస్ ఓడించింది. పట్టుబట్టి మరీ రేవంత్ ను ఓడించారు గులాబీ శ్రేణులు. ఇన్నాళ్లుగా రేవంత్ ను ఆదరించిన కొడంగల్ ప్రజలు టీఆర్ఎస్ సునామీలో మాత్రం కాలదన్నారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయ ఫైర్ బ్రాండ్ అయిన రేవంత్ రెడ్డి ప్రభ మసకబారింది. రేవంత్ సొంత నియోజకవర్గంలోనే గెలవలేకపోయాడన్న ఆవేదన.. ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆరునెలల అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన సొంత స్థానం నుంచి కాకుండా హైదరాబాద్ శివారు అయిన మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీచేశారు. కానీ ఇక్కడి ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఎదుగుదలకు మల్కాజిగిరి వాసులు పునాది వేశారు. అక్కడి నుంచి మొదలైన రేవంత్ రెడ్డి రాజకీయం ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగే వరకు సాగింది.

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలతో కలిసి ఏర్పాటైంది. అక్షరాస్యులు అధికంగా ఉన్న నియోజకవర్గం ఇదీ. అందుకే యువతే తనను గెలిపిస్తారని రేవంత్ పోటీ చేశారు. ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లే ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేసి గెలిచారు. ప్రశ్నించే గొంతుకలా.. మంచి వాగ్ధాటితో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు.

మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై చురుకుగా స్పందిస్తూ ఆ ప్రాంత ప్రజల మనసు దోచుకుంటున్నారు. ప్రజాసమస్యలపై ఆందోళనలూ చేస్తున్నారు. ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ స్థాయికి చేరడం వెనుక ఖచ్చితంగా మల్కాజిగిరి ప్రజల మద్దతు ఉంది. వారి వల్లే రేవంత్ ఇప్పుడు రాజకీయంగా బలంగా నిలబడ్డారని చెప్పొచ్చు.