Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు?

By:  Tupaki Desk   |   25 Nov 2021 5:30 PM GMT
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు?
X
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద దారుణంగా హత్యకు గురైన సంఘటన ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెల్సిందే. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా ఈ కుటుంబంగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోంది. వైఎస్ తండ్రి రాజారెడ్డి నుంచి నేటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు అంతా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నవారే.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంది? అంత సాహసం ఎవరు చేయగలుగుతారనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ కేసుపై నాటి టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత జగన్ సర్కారు ఏటూ తేల్చకపోవడంతో సీబీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే పలువురిని నిందితులుగా గుర్తించి సీబీఐ కోర్టులో హాజరుపర్చింది. ఈ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే అనేక మంది పేర్లు తెరపైకి వస్తూ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులు ఓ కొలిక్కి రాగా విచారణను సీబీఐ వేగవంతం చేస్తోంది.

వివేకానంద హత్య కేసు విచారణలో భాగంగా వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ విచారించేందుకు రెడీ అయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని పులివెందుల కోర్టును సీబీఐ కోరగా అనుమతించింది. కడప కేంద్ర కారాగారంలో ఉన్న శంకర్ రెడ్డిని ఎనిమిది రోజులపాటు కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరగా 7రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

దీంతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనే చర్చ నడుస్తోంది. ఏదిఏమైనా వైఎస్ వివేకనంద రెడ్డి హత్య కేసులో అసలు నిజాలు ఏంటని తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు.