Begin typing your search above and press return to search.

పాక్ పై యుద్ధం!..యాంకర్లందరిదీ ఇదే మాట‌!

By:  Tupaki Desk   |   16 Feb 2019 5:20 PM GMT
పాక్ పై యుద్ధం!..యాంకర్లందరిదీ ఇదే మాట‌!
X
పుల్వామాలో ఉగ్ర‌వాదుల దొంగ‌దెబ్బ‌పై దేశం మొత్తం అట్టుడుకుతోంది. దారి కాచి దొంగ‌దెబ్బ తీసిన ఉగ్ర‌వాదుల ప‌నిబట్టాల్సిందేనంటూ ఒక్క గొంతుకై నినదిస్తోంది. 40 మంది సైనికుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ఉగ్ర‌వాదుల‌కు అంత‌కంతా బుద్ధి చెప్పాల్సిందేనని కేంద్రంలోని మోదీ స‌ర్కారుకు విన్న‌విస్తోంది. ఇందులో భాగంగా దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు హోరెత్తుతుండ‌గా, దేశ ప్ర‌జ‌లంతా అమ‌ర వీరుల‌కు క‌న్నీటి వీడ్కోలు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా ఏం చేద్దాం, ఏ త‌ర‌హా వైఖ‌రితో ముందుకెళ‌దామ‌న్న విష‌యంపై చ‌ర్చించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అఖిల ప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ భేటీలో అదికార పార్టీతో స‌హా విప‌క్షాల‌న్నీ కూడా ఉగ్ర‌వాదుల‌కు బుద్ధి చెప్పేలా గ‌ట్టి చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రి అన్న వాద‌న‌ను వినిపించాయి. ఓ వైపు అఖిల ప‌క్ష భేటీ జ‌రుగుతుండ‌గానే.. మ‌రోవైపు నేష‌న‌ల్ మీడియాతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ న్యూస్ ఛానెళ్లు కూడా ఉగ్ర‌దాడిపైనే ప్ర‌ధానంగా క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి. ఉగ్ర‌వాదుల పీచ‌మ‌ణ‌చాల్సిందేనని మొత్తం అన్ని మీడియా ఛానెళ్లు కూడా గొంతెత్త‌తి నిన‌దించాయి.

ఈ త‌ర‌హా నినాదాలు ఇచ్చిన వారిలో ప్ర‌ముఖ న్యూస్ ఛానెళ్ల‌లో న్యూస్ యాంక‌ర్ల‌తో పాటు బుల్లితెర న‌టులు కూడా ఉన్నారు. ముందుగా ఈ త‌ర‌హా నినాదాన్ని మొద‌లెట్టిన వారిలో బుల్లితెర యాంక‌ర్ రష్మీ గౌతం పేరే వినిపిస్తోంది. దాడిపై త‌న‌దైన రీతిలో స్పందించిన మాజీ క్రికెట‌ర్‌, పంజాబ్ రాజ‌కీయ నేత న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించేందుకు సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మీ... త‌న‌దైన శైలి ముత‌క వ్యాఖ్య‌ల‌తో చెడుగుడు ఆడేసింది. సాలే, తెరే మాకీ.... త‌దిత‌ర ప‌దాల‌ను వాడిన ర‌ష్మీ... ఉగ్ర పోరుపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిందేన‌ని అభిప్రాయ‌ప‌డింది. ఉగ్ర‌వాదానికి ఊత‌మిస్తున్న పాకిస్థాన్‌పై యుద్దం త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌ని కూడా ఆమె చెప్పేసింది. *ప్రతీకారం కోరుకుంటున్న భారత్‌* అన్న క్యాప్ష‌న్‌తో నేష‌న‌ల్ న్యూస్ ఛానెల్ రిపబ్లిక్‌ టీవీ వార్తలను ప్రసారం చేసింది. సీనియర్‌ జర్నలిస్ట్, ఆ టీవీ యాంకర్‌ అర్నాబ్‌ గోసామి మాట్లాడుతూ పాక్‌తో యుద్ధం చేయడం మినహా మరో మార్గం ఉందా? ఎంతమాత్రం లేదంటూ జ‌డ్జిమెంట్ ఇచ్చేశారు.

పాకిస్థాన్‌ విషయంలో ఇక వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు అంటూ టైమ్స్‌ నౌ యాంకర్‌ నావికా కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. *ఓ భారత ప్రధాని ప్రజలనుద్దేశించి ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే మొదటి సారి. పాకిస్థాన్‌తో పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు* అని ఇండియా టుడే టీవీ యాంకర్‌ రాహుల్‌ కన్వల్‌ వ్యాఖ్యానించారు. *పాకిస్థాన్‌లోని అన్ని టెర్రరిస్టు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపాలి* అంటూ న్యూస్‌ 18 యాంకర్‌ భూపేంద్ర చౌబే పిలుపునిచ్చారు. ఇక మ‌రో అడుగు ముందుకేసిన ఏబీపీ న్యూస్ ఛానెల్... యుద్ధానికి సమయం ఆసన్నమైందని పేర్కొంటూ 2016లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్‌ దాడులను ప్రస్తావిస్తూ ఇటీవల విడుదలైన ‘యురి’ బాలివుడ్‌ సినిమాలోని క్లిప్స్‌ను చూపించేసింది. మొత్తంగా ఉగ్రదాడిపై అటు రాజ‌కీయ పార్టీల‌తో పాటు ఇటు మీడియా ఛానెళ్ల‌న్నీ ఒకే మాట‌ను వెల్ల‌డించాయి.