Begin typing your search above and press return to search.

గౌతం రెడ్డి దిగిరాక త‌ప్ప‌లేదే!

By:  Tupaki Desk   |   5 Sep 2017 4:39 AM GMT
గౌతం రెడ్డి దిగిరాక త‌ప్ప‌లేదే!
X
ఒకే పార్టీలో ఉంటూ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలితే ఎలా ఉంటుందో... మొన్న విజ‌య‌వాడ‌లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. త‌న ప‌నేదో తాను చేసుకుంటూ పోతున్న ఓ కీల‌క నేత‌ను గిల్లి మ‌రీ క‌జ్జాలు పెట్టుకున్న పాపానికి వైసీపీ బ‌హిష్కృత నేత పూరూరి గౌతంరెడ్డికి నిజంగానే దిమ్మ తిరిగినంత ప‌నైంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఓ టీవీ చానెల్ నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక ప్రోగ్రామం కింద ఇంట‌ర్వ్యూ ఇచ్చిన గౌతంరెడ్డి... కాపుల్లో బ‌ల‌మైన నేత‌గా గుర్తింపు ఉన్న దివంగ‌త నేత వంగ‌వీటి రంగా - ఆయ‌న సోద‌రుడు వంగ‌వీటి రాధాకృష్ణ‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. గౌతంరెడ్డి ఇచ్చిన స‌ద‌రు ఇంట‌ర్వ్యూ పూర్తిగా టెలికాస్ట్ కాకముందే... దానికి మంచి వ్యూయ‌ర్ షిప్ సాధించేందుకంటూ ఆ టీవీ చానెల్ ప్రోమోల‌ను విడుద‌ల చేసింది.

స‌ద‌రు ప్రోమోల్లోనూ రంగా - రాధాల‌పై గౌతంరెడ్డి చేసిన ఘాటు కామెంట్లు ఉండ‌టంతో ఒక్క‌సారిగా విజ‌య‌వాడ వేడెక్కింది. గౌతంరెడ్డి కామెంట్ల‌కు ప్ర‌తిస్పందించేందుకు య‌త్నించిన రంగా కుమారుడు - వైసీపీ కీల‌క నేత‌ - మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణను పోలీసులు అడ్డుకుని నానా యాగీ చేశారు. రంగా స‌తీమ‌ణి ర‌త్న‌కుమారిపైనా వారు దురుసుగా వ్య‌వ‌హ‌రించారు. పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రాధా... త‌న‌ను ఎందుకు అరెస్ట్ చేశార‌న్న విష‌యం చెబితే గానీ వినేది లేద‌ని భీష్మించారు. ఈ క్ర‌మంలో రంగా అభిమానులు రాధాను ఉంచి పోలీస్ స్టేష‌న్‌ కు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తున్న వైనాన్ని ప‌రిశీలించిన పోలీసులు... రాధాను బేష‌ర‌తుగానే విడుద‌ల చేశారు.

ఈ లోగా పార్టీ బేస్ లైన్‌ను గౌతంరెడ్డి దాటార‌ని నిర్ధారించుకున్న వైసీపీ ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసింది. ఇదంతా మొన్న జ‌రిగిన వ్య‌వ‌హారం. ఇక నిన్న‌టి వ్య‌వ‌హారానికి వ‌స్తే... గౌతంరెడ్డి కామెంట్ల‌పై స్పందించేందుకు రాధా త‌న కార్యాల‌యంలో నిన్న మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. గౌతంరెడ్డి వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. అయితే వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నించిన గౌతంరెడ్డి... నిన్నంతా దాదాపుగా అజ్ఞాతంలోనే గ‌డిపార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇలాగైతే కుద‌రద‌న్న భావ‌న‌కు వ‌చ్చిన గౌతంరెడ్డి తాను ఇంట‌ర్వ్యూ ఇచ్చిన టీవీ ఛానెల్ కాళ్లా వేళ్లా ప‌డ్డార‌ట‌. స‌ద‌రు వ్యాఖ్య‌లను తొల‌గించాల‌ని ఆయ‌న వేడుకున్నార‌ట‌.

అయితే ప్రోమోల‌కే ఈ మేర యాగీ జరిగితే.. ఇక పూర్తి స్థాయి ఇంట‌ర్వూ టెలికాస్ట్ అయితే ప‌రిస్థితి ఏమిట‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన స‌ద‌రు టీవీ ఛానెల్ కూడా దిగి రాక త‌ప్ప‌లేదు. అటు గౌతంరెడ్డి, ఇటు టీవీ ఛానెల్ చ‌ర్చించుకుని రంగా - ఆయ‌న సోదరుడిపై ఘాటు వ్యాఖ్య‌ల‌న్నింటినీ డిలీట్ చేసిన త‌ర్వాతే ఆ ఇంట‌ర్వ్యూను ప్ర‌సారం చేశార‌ట‌. ప‌నిలో ప‌నిగా గౌతంరెడ్డి తాను త‌ప్పు చేశార‌ని ఒప్పేసుకున్నారు. అన్య‌థా భావించ‌వ‌ద్దు అంటూ ఆయ‌న రాధాకు పరోక్షంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లుగా ప‌లు ప‌త్రిక‌లు క‌థ‌నాలు రాశాయి. ఇదిలా ఉంటే... నేడు మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ గౌతంరెడ్డి... వంగ‌వీటి ఫ్యామిలీతో పాటు రంగా అభిమానుల‌కు క్ష‌మాప‌ణ చెబుతార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.