Begin typing your search above and press return to search.

ఏంది ర‌వి సార్.. ఇదంతా మ‌న‌కు అవ‌స‌ర‌మా?

By:  Tupaki Desk   |   12 Jun 2019 7:30 AM GMT
ఏంది ర‌వి సార్.. ఇదంతా మ‌న‌కు అవ‌స‌ర‌మా?
X
ఆద‌ర్శాలు చెప్పినోళ్లంతా గొప్పొళ్లు కాదు. చెప్పే ఆద‌ర్శాలు చేత‌ల్లో చూపించిన‌ప్పుడు సార్థ‌క‌త ఉంటుంది. ఈ విష‌యాన్ని మ‌ర్చిపోకుండా పాటించే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు కానీ.. మాట‌ల్లో చెప్పే ఆద‌ర్శాలు చేత‌ల్లో మిస్ అయిన‌ప్పుడు మాత్రం వారిని న‌మ్ముకున్నోళ్ల‌కు షాకులు త‌ప్ప‌వు.

తాజాగా టీవీ9 ఉద్యోగుల ప‌రిస్థితి ఇలానే ఉంది. మొన్న‌టివ‌ర‌కూ తాము దేవుడిగా ఫీలైన వ్య‌క్తి ఇంత చిల్ల‌ర‌గా.. దారుణంగా వ్యాఖ్య‌లు చేయ‌టం ఏమిట‌న్న ఆవేద‌న‌ను టీవీ9 ఉద్యోగులు వ్య‌క్తం చేస్తున్నారు. భాగ‌స్వాముల మ‌ధ్య ఏదైనా పంచాయితీ ఉంటే దాని సంగ‌తి చూసుకోవాలే కానీ.. సంస్థ‌ను దెబ్బ తీసేలా వ్యాఖ్య‌లు.. దాని ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా విమ‌ర్శ‌లు చేయ‌టం ఏమిటంటూ వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌లు నేరారోప‌ణ‌ల‌తో కేసుల్లో చిక్కుకున్న ర‌విప్ర‌కాశ్‌.. తన బెయిల్ పిటిష‌న్ కోసం వినిపించిన వాద‌న‌ల్లో పాత‌.. కొత్త యాజ‌మాన్యాల మీద ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న‌కు తాను నాటిన మొక్క‌గా టీవీ9ను చెప్పే ర‌విప్ర‌కాశ్‌.. ఇంత దారుణంగా ఎలా ఆరోప‌ణ‌లు చేస్తారు? అని ప్ర‌శ్నిస్తున్నారు.

టీవీ9ను ప్రారంభించే స‌మ‌యంలోనే అక్ర‌మ ప‌ద్ద‌తిలో.. హ‌వాలాలో నిధులు వ‌చ్చిన‌ట్లుగా ఆరోపించ‌టం ఏ మాత్రం స‌రికాద‌ని.. అలా చెప్ప‌టం ద్వారా.. టీవీ9 సంస్థ మీద ఉన్న ఇమేజ్ ను దారుణంగా దె్బ్బ తీసిన‌ట్లుగా వారు ఫీల్ అవుతున్నారు. ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్ నేప‌థ్యంలో కొత్త యాజ‌మాన్యానికి కొంద‌రు సీనియ‌ర్ ఉద్యోగులు ఒక విన్న‌పాన్ని చేసిన‌ట్లుగా చెబుతారు.

మీ మ‌ధ్యన చాలానే ఉండొచ్చు. కానీ.. మేం ఆయ‌న‌తో క‌లిసి ఏళ్ల‌కు ఏళ్లుగా ప‌ని చేశాం. ఆయ‌న‌పై నింద‌లు మోపేలా మా చేత వార్త‌లు రాయించొద్దు.. చ‌దివించొద్దు. మా నుంచి మీకుండే ఒకే ఒక్క రిక్వెస్ట్ అని చెప్ప‌టం.. ఆ విష‌యంలో వారు అభ‌యం ఇవ్వ‌టాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి వేళ‌.. ఇంత నీచంగా ఎలా నింద‌లు మోపుతారు? అన్న ప్ర‌శ్న ప‌లువురు ఉద్యోగుల్లో వినిపిస్తోంది. తాజా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ర‌విసార్ ఏం చేస్తున్నారు? ఎందుకిలా చేస్తున్నారు? ఇలా త‌ప్పుల మీద త‌ప్పులు చేయ‌టం ఏమిటి? ఆయ‌న‌కు ఏమైంది? అన్న ప్ర‌శ్న‌లు ప‌లువురు ఉద్యోగుల్లో వ‌స్తున్నాయి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో త‌మ సార్ మీద మ‌న‌సు విరిగిపోయిన‌ట్లుగా పేర్కొన‌టం గ‌మ‌నార్హం. టీవీ9 ఉద్యోగుల్లో ఈ త‌ర‌హా భావ‌న ఇంత‌కు ముందు లేద‌ని.. తాజా ప‌రిణామాల‌తో వారిలో మార్పు పెద్ద ఎత్తున వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో ఉన్న సానుకూల‌త ప్ర‌స్తుతం లేద‌న్న‌ది తాజా స‌మాచారం.