Begin typing your search above and press return to search.

ర‌వి ప్ర‌కాశూ..మెరుగైన స‌మాజ‌మంటే ఇదేనా?

By:  Tupaki Desk   |   10 May 2019 8:30 AM GMT
ర‌వి ప్ర‌కాశూ..మెరుగైన స‌మాజ‌మంటే ఇదేనా?
X
మెరుగైన స‌మాజం పేరిట తెలుగు మీడియా రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న టీవీ 9 సీఈఓ ర‌విప్ర‌కాశ్... విష‌యం త‌న దాకా వ‌స్తే గానీ నిజాన్ని నిర్భ‌యంగా ప్ర‌సారం చేయ‌డం ఎంత కష్ట‌మో తెలిసిరాలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. తెలుగు నేల‌తో పాటు దేశం - విదేశాల్లో జ‌రిగే ఏ చిన్న విష‌యాన్నైనా త‌న‌దైన శైలిలో మ‌సాలా ద‌ట్టించేసి జ‌నాల‌ను టీవీ తెర‌ల‌కు అతుక్కుపోయేలా చేసే ర‌వి ప్ర‌కాశ్ నిన్న మాత్రం... త‌న గురించిన స‌మాచారం కోసం జ‌నాన్ని ఇత‌ర ఛానెళ్ల వెంట ప‌డేలా చేశార‌నే చెప్పాలి. ఎందుకంటే... త‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న కీల‌క ప‌రిణామాల‌ను ఆయ‌న‌ ప్ర‌సారం చేయ‌లేదు స‌రిక‌దా... క‌నీసం స్క్రోలింగ్ కూడా ర‌న్ చేయ‌లేదు.

నిన్న ఉద‌యం నుంచి టీవీ 9లో పోలీసులు సోదాలు చేశార‌ని - టీవీ 9 సీఈఓ ర‌విప్ర‌కాశ్ పై కేసు న‌మోదైంద‌ని - ఆయ‌న‌ను టీవీ 9 సీఈఓ ప‌ద‌వి నుంచి తొల‌గించార‌ని - కేసు న‌మోదు అయిన నేప‌థ్యంలో ర‌విప్ర‌కాశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయార‌ని - ఆయ‌న ఇంటితో పాటు సినీ న‌టుడు శివాజీ - టీవీ 9 సీఎఫ్ ఓ మూర్తిల ఇళ్ల‌ల్లో సోదాలు జ‌రిగాయ‌ని - చివ‌రకు ర‌విప్ర‌కాశ్ పాస్ పోర్టును కూడా సీజ్ చేశార‌న్న వార్తలు సాయంత్రం దాకా నాన్ స్టాప్‌ గానే వినిపించాయి. అయితే ఈ వార్త‌ల్లో ఏ ఒక్క వార్తను కూడా టీవీ 9 స్క్రీన్ పై ర‌వి ప్ర‌కాశ్ క‌నిపించకుండా చేయ‌డం గ‌మ‌నార్హం.

మెరుగైన స‌మాజం కోసం అంటూ త‌న ట్యాగ్ లైన్ ను జ‌నాల్లోకి బాగానే తీసుకుని వెళ్లిన ర‌వి ప్ర‌కాశ్... మ‌రి అదే మెరుగైన స‌మాజం కోసం త‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న కీల‌క ప‌రిణామాలు జ‌నానికి తెలియ‌జేయాల‌న్న ధ్యాసే ఆయ‌న‌కు ఎందుకు లేక‌పోయింద‌న్నది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మొత్తంగా నిన్న‌టి దాకా ప్ర‌తి అంశాన్ని అందరి కంటే ముందే ప్ర‌సారం చేసే ర‌వి ప్ర‌కాశ్ త‌న‌కు సంబంధించిన వార్త‌ల‌ను... అది కూడా జ‌నం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌ని - వాస్త‌వాల‌ను తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారని తెలిసి కూడా ఆయన ఈ వార్త‌ల‌ను ఎందుకు ప్ర‌సారం చేయ‌లేద‌ని ఇప్పుడు జ‌నం చ‌ర్చించుకుంటున్నారు. అంతేకాకుండా త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించ‌డానికి అమితాసక్తి క‌న‌బ‌ర‌చ‌డంతో పాటు ప‌రుగెత్తుకుంటూ స్క్రీన్ పై క‌నిపించిన ర‌విప్ర‌కాశ్... త‌న‌పై కేసుల విష‌యాన్ని మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.