Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ రాకెట్‌ లో కేటీఆర్ ఫ్రెండ్స్‌?

By:  Tupaki Desk   |   20 July 2017 5:53 AM GMT
డ్ర‌గ్స్ రాకెట్‌ లో కేటీఆర్ ఫ్రెండ్స్‌?
X
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ట్రెండింగ్ వార్త‌గా నిలిచిన డ్ర‌గ్స్ రాకెట్ పై మాట‌ల తూటాలు పేలుతున్నాయి. నిన్న‌టిదాకా ఈ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ నేత‌లు పెద్ద‌గా మాట్లాడిన దాఖ‌లా లేదు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని, యువ‌త‌ను ప‌ట్టిపీడిస్తున్న డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిని కూక‌టివేళ్ల‌తో పెకిలించి వేసేందుకు ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ కు స‌ర్వాధికారులు ఇచ్చామ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న మిన‌హా.. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి రాజ‌కీయ నేత‌ల నుంచి పెద్ద‌గా ప్ర‌క‌ట‌న‌లే రాలేద‌ని చెప్పొచ్చు. టాలీవుడ్‌ ను కుదిపేస్తున్న ఈ డ్ర‌గ్స్ రాకెట్ త‌మ మెడ‌కు ఎక్క‌డ చుట్టుకుంటుందోనన్న భ‌యంతో అటు అధికార పార్టీ నేత‌లు గానీ, ఇటు విప‌క్షాల‌కు చెందిన నేత‌లు గానీ దీనిపై స్పందించేందుకు వెనుకాడార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. దీంతో ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు ముమ్మ‌రంగా సాగ‌డానికి కూడా ప‌రోక్షంగా రాజ‌కీయ నేత‌లే కార‌ణంగా నిలుస్తున్నార‌ని కూడా చెప్పొచ్చు.

అయితే ఎలాంటి రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు - ప్ర‌కంప‌న‌లు లేకుండానే సాగుతున్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఎట్ట‌కేల‌కు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేగాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు చెందిన సీనియ‌ర్ నేత‌ - మ‌ధ్య ప్ర‌దేశ్ కు సీఎంగా వ్య‌వ‌హ‌రించిన కీల‌క రాజ‌కీయ‌వేత్త దిగ్విజ‌య్ సింగ్ ఈ వ్య‌వ‌హారంపై నోరు విప్పారు. డిగ్గీరాజాగా మ‌నం పిలుచుకుంటున్న ఆయ‌న నోట నుంచి నేటి ఉద‌యం వ‌చ్చిన ప్ర‌క‌ట‌న తెలంగాణ‌లో మంట‌లు పుట్టించింద‌ని చెప్ప‌క త‌ప్పుదు. ఎందుకంటే... డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై స్పందించేందుకు ట్విట్ట‌ర్ లోకి ఎంట్రీ ఇచ్చిన డిగ్గీరాజా... ఏకంగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు - ఆ పార్టీ యువ‌నేత‌ - తెలంగాణ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావును టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కేటీఆర్‌ ను టీఆర్ ఎస్ వారుసుడిగా పేర్కొంటూ ఆయ‌న స్నేహితులకు డ్ర‌గ్స్ రాకెట్‌ తో సంబంధాలున్నాయంటూ డిగ్గీరాజా చేసిన కామెంట్ల‌పై కేటీఆర్ కూడా వెనువెంట‌నే స్పందించారు. రిటైర్ అవ్వాల్సిన వ‌య‌సులో... వ‌య‌సుకు త‌గిన‌ట్లుగా న‌డుచుకోండి అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. నేటి ఉద‌యం 8.42 గంట‌ల‌కు డిగ్గీరాజా ట్విట్ట‌ర్‌ లో ఎంట్రీ ఇవ్వ‌గా, ఓ గంట‌లోనే స్పందించిన కేటీఆర్ స‌రిగ్గా 10 గంట‌ల‌కు త‌న రెస్పాన్స్‌ ను అదే ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. డిగ్గీరాజా ట్వీట్‌ - కేటీఆర్ రీట్వీట్ తో ఇప్పుడు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారానికి రాజ‌కీయ రంగు కూడా వ‌చ్చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక వారిద్ద‌రి ట్విట్ట‌ర్ సందేశాల‌ను ప‌రిశీలిస్తే... తొలుత డిగ్గీరాజా ట్వీట్‌ ను చూద్దాం. ‘తెలంగాణలో పెద్ద డ్రగ్స్‌ స్కామ్‌ జరిగింది. ఇందులో టీఆర్‌ ఎస్‌ వారసుడి మిత్రులు ఉన్నట్టుగా కనబడుతోంది. వీరిని విచారిస్తారో, కాపాడతారో చూడాలి’ అంటూ ఆయ‌న త‌న‌దైన శైలి ట్వీట్‌ తో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారానికి రాజ‌కీయ రంగు పులిమేశారు. ఆ వెంట‌నే స్పందించిన కేటీఆర్ కూడా డిగ్గీరాజాకు దిమ్మ‌తిరిగే స‌మాధానంతో రీ ట్వీట్ కొట్టారు. కేటీఆర్ రీట్వీట్ సారాంశం ఇలా సాగింది. ‘మీరు పూర్తిగా విచక్షణ కోల్పోయారు. గౌరవంగా రిటైర్‌ కావాల్సిన సమయం ఆసన్నమైంది. మీ వయసుకు తగ్గట్టుగా నడుచుకోండి. తెలంగాణ స్పెల్లింగ్ కరెక్ట్‌ గా రాయడం నేర్చుకున్నందుకు సంతోషమ’ని కేటీఆర్ ఆ ట్వీట్ తో పేర్కొన్నారు.