Begin typing your search above and press return to search.
అమ్మ కోడలు.. కొత్త ట్విస్ట్ ఇచ్చిందే!
By: Tupaki Desk | 12 Feb 2018 7:56 AM GMTదివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప నివాసంలో ఇటీవల జరిగిన ఆదాయపన్ను శాఖ దాడులకు సంబంధించి పెద్ద ట్విస్టే ఇప్పుడు బయటకు వచ్చింది. దీప ఇంటిలో జరిగిన సోదాల్లో పాలుపంచుకున్నది నిజమైన ఐట అధికారులు కాదట. అద్దెకు తీసుకొచ్చిన నకిలీ ఐటీ బృందమట. శనివారం దీప ఇంట ఐటీ దాడులు చోటుచేసుకోగా... 24 గంటలు గడవకముందే... ఆ దాడులు నకిలీ అధికారుల పుణ్యమేనని తేలిపోవడంతో అంతా షాక్‌కు గురయ్యారు. అయినా తమిళ పైత్యానికి పరాకాష్టగా నిలుస్తున్న ఈ వ్యవహారానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలే వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా చూస్తే... ఈ ట్విస్ట్ దెబ్బకు అమ్మ కోడలు ఇక తలుపులు వేసేసుకోవడం మినహా చేసేదేమీ లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఇక ఈ నకిలీ భాగోతం విషయానికి వస్తే... శనివారం పొద్దుపొద్దునే దీప ఇంటి ముందు వాలిపోయిన ఓ బృందం తాము ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చామని చెప్పి... ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే తమిళనాట నిత్యకృత్యమైన ఐటీ దాడుల నేపథ్యంలో నకిలీ అధికారులు వచ్చినా.. ఏ ఒక్కరికి కూడా అనుమానం రాలేదట. అయితే దీప ఇంటిలోకి వెళ్లిన ఐటీ అధికారుల వ్యవహార సరళిపై అనుమానం రావడంతో పోలీసులకు కంప్లైంట్ వెళ్లగా... ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనన్న భయంతో ఆ నకిలీ టీం చిన్నగా జారుకుందట. తీరా పోలీసులు వచ్చేసరికి ఐటీ అధికారులు వెళ్లిపోవడం, దీనిపై పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేయడంతో దీనిపై మరింత సస్పెన్స్ నెలకొంది. అయినా ఈ దాడులు చేసిందెవరన్న విషయంపై పూర్తి ఆధారాలు రాబట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగిపోగా... పట్టుబడితే ఎక్కడ మక్కెలు విరిగిపోతాయోనన్న భయంతో ఈ నకిలీ బృందానికి నేతృత్వం వహించిన వ్యక్తి నేరుగా పోలీసుల వద్దకే వచ్చి లొంగిపోయాడట.
సదరు వ్యక్తి చెప్పిన విషయాలు విని నోరు తెరిచేసిన పోలీసులు... అతడు చెప్పిన పూర్తి వివరాలు విని షాక్ తిన్నారట. అయినా తనకు తానుగా దీప ఇంటిపై దాడులకు వెళ్లలేదని, దీప భర్త మాధవన్ ఆదేశాల మేరకే తాను ఈ దురాగతానికి పాల్పడ్డానని పేర్కొన్నాడట. దీపను భయపెట్టేందుకే ఆమె భర్త ఈ పథకం రచించినట్లుగా అతడు పోలీసులకు చెప్పుకొచ్చాడు. సినిమాలో మాదిరి పెద్ద ఎత్తున డబ్బు, వస్తువులను దోపిడీ చేయవచ్చనే ఉద్దేశంతోనే నకిలీ దాడులకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తుండగా.. తాజాగా లొంగిపోయిన నిందితుడు సంచలన విషయాలు తెలిపాడు.