Begin typing your search above and press return to search.

నోట్ల మార్పిడిపై భారీ బాంబు పడినట్లే

By:  Tupaki Desk   |   18 Nov 2016 4:24 AM GMT
నోట్ల మార్పిడిపై భారీ బాంబు పడినట్లే
X
పెద్దనోట్ల రద్దు సందర్భంగా తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని జీవోలో ఉన్నది ఉన్నట్లుగా పేర్కొంటున్న మీడియా పుణ్యమా అని ప్రజలు చాలానే అవస్థలు ఎదుర్కొంటున్నారు. ‘కేంద్రం ఏం చెప్పిందో మేం అదే చెబుతాం’ అన్నట్లుగా వ్యవహరించటంతో వాస్తవానికి.. ప్రజలకు అర్థమయ్యే దానికి మధ్య వ్యత్యాసం రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో.. ప్రజలు తమకు అర్థమైన విషయానికి.. బ్యాంకుల వద్దకు వెళ్లాక.. అక్కడ భారీ క్యూలో నిలుచున్న తర్వాత బ్యాంకు అధికారులు చెబుతున్న దానికి పోలిక కుదరక తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు.

ఇలాంటి పరిస్థితి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. దీనికి కారణం.. విషయాన్ని విషయంగా చెప్పటంతోనే పెద్ద సమస్యగా చెప్పాలి. కాస్త స్వేచ్ఛ తీసుకొని చెప్పటానికి మీడియాకు చెందిన వారు ‘రిస్క్’గా భావించటంతో కొత్త కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. దీనికి పెద్ద ఉదాహరణగా నోట్ల మార్పిడి అంశాన్ని చెప్పాలి. ప్రజలు తమ వద్ద ఉన్న పాత రూ.1000.. రూ.500 నోట్లను బ్యాంకుల వద్దకు తీసుకొచ్చి మార్చుకోవచ్చన్న మాటను అందరూ చెప్పిందే. అయితే.. ఇక్కడే చాలా పెద్ద పరిమితిని మీడియా వివరంగా చెప్పట్లేదు.

యాభై శాతం డిస్కౌంట్.. 70 శాతం డిస్కౌంట్ అంటూ ప్రకటన చేసినప్పుడు ఆ మాటకు పైన ఒక చిన్న స్టార్ గుర్తు ఎలా ఉంటుందో.. పాత నోట్ల మార్పిడికి సంబంధించి కూడా పలు పరిమితులతో కూడిన ‘స్టార్’ ఉంది. దాని గురించి మీడియా ఫోకస్ చేయకపోవటంతో బ్యాంకులకు వెళ్లిన ప్రజలు.. అక్కడి అధికారులు చెప్పిన మాట విని అవాక్కు అవుతున్నారు.

అదెలానంటే.. పాత నోట్లను బ్యాంకులకు తీసుకెళ్లి మార్చుకోవచ్చన్న సింఫుల్ గా వ్యవహారం లేదు. ఎవరైనా ఒకరు తమ వద్ద ఉన్నపాత వెయ్యి.. రూ.500 నోట్లను కేవలం రూ.4వేలు మాత్రమే ఇచ్చి వాటిస్థానంలో కొత్తవి తీసుకోవచ్చు. అయితే.. ఈ పరిమితిని ఆ మధ్యన రూ.4500లకు పెంచారు. కానీ ఈ రోజు నుంచి (శుక్రవారం) ఆ పరిమితిని రూ.2వేలకు కుదించారు.

పరిమితిని పెంచటం.. కుదించటం లాంటి విషయాల్ని కాసేపు పక్కన పెడితే.. అన్నింటికంటే కీలకమైనది ఎవరైనా ఒకరు ఇలా నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం డిసెంబరు 30 వరకు ఒక్కసారి మాత్రమే ఉంటుందన్న విషయాన్ని మీడియా ప్రముఖంగా ఫోకస్ చేయటం లేదు. అంటే.. ఎవరైనా సరే తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లలో కేవలం రూ.2వేలు (ఈ రోజు నుంచి) మాత్రమే బ్యాంకులకు ఇచ్చి తిరిగి అదే మొత్తాన్ని వెనక్కి తీసుకోగలుగుతారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో తప్పనిసరిగా డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుంది.

అంటే.. చేతిలో ఉన్న నగదును బ్యాంకులో అలా ఇచ్చి ఇలా తీసుకోవటానికి కేవలం రూ.2వేలు (ఈ రోజు నుంచి) మాత్రమే వీలుంది. మిగిలిన మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్ వేసిన తర్వాత వెనక్కి తీసుకునే వీలుంది. అంటే.. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత ఒకేఒక్కసారి మాత్రమే ఎవరైనా సరే నగదు మార్పిడిని చేసుకునే వీలుంది. అది కూడా రూ.2వేలే. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలి. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకుండా తప్పనిసరిగా తెరిచి.. అందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న రూ.4500 మొత్తాన్ని రూ.2వేలకు కుదించటం ద్వారా.. పాతనోట్ల విషయంలో ప్రభుత్వం మరింత కరకుగా వ్యవహరిస్తుందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేని వారికి.. ఈ నిర్ణయం భారీ బాంబు మీద పడినట్లుగా అవుతుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/