Begin typing your search above and press return to search.

టార్గెట్లు చేరుకోవటానికి ఆఫీసుల్లో నిద్ర పోతున్న ట్విటర్ ఉద్యోగులు

By:  Tupaki Desk   |   3 Nov 2022 10:30 AM GMT
టార్గెట్లు చేరుకోవటానికి  ఆఫీసుల్లో నిద్ర పోతున్న ట్విటర్ ఉద్యోగులు
X
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. తాను అనుకున్న పనిని అనుకున్నట్లు పూర్తి చేయటం కోసం ఉద్యోగుల్ని రాచి రంపాన పెట్టటమే కాదు..

నిర్మోహమాటంగా వారిని ఉద్యోగం నుంచి తీసేయటానికి సైతం వెనుకాడరు. తనకు నచ్చని వారు కంపెనీలో ఉండకూడదన్న ఉద్దేశంతో ట్విటర్ లో కీలక ఉద్యోగుల్ని తీసేయటమే కాదు.. వారిని అత్యంత అవమానకరంగా ఆఫీసు నుంచి బయటకు పంపటం తెలిసిందే. తాను అనుకున్నట్లుగా ట్విటర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ఇప్పుడు బ్లూ టిక్ వినియోగదారుల నుంచి నెలకు 8 డాలర్లు వసూలు చేసేందుకు వీలుగా.. కొత్త మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా.. తాను చెప్పిన పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఫత్వా జారీ చేశారు. దీంతో.. ట్విటర్ ఉద్యోగులు ఇప్పుడు ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు. ఆఫీసులోనే ఉంటూ.. తీవ్రంగా అలసిపోయిన వేళలో.. ఆఫీసు నేల మీదనే నిద్ర పోతున్న వైనం ఇప్పుడు కనిపిస్తోంది. తాజాగా ప్రొడక్టు మేనేజ్ మెంట్ డైరెక్టర్ ఎస్తర్ క్రాఫోర్డు ఆఫీసులోని నేలపై నిద్ర పోతున్న ఫోటోను ఇవాన్ అనే ఉద్యోగి ట్విటర్ లో పోస్టు చేశారు.
ట్విటర్ బాస్ నుంచి ఏదైనా కోరుకున్నప్పుడు ఇలా ఉండాల్సిందేనంటూ క్యాప్షన్ పెట్టగా.. ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ తీరును పలువురు తిట్టి పోస్తున్నారు.

కొత్త మార్పులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్న ఎలాన్ మస్క్.. అందులో భాగంగా ట్విటర్ ఉద్యోగుల్ని రోజుకు 12 గంటల పాటు ఆఫీసులోనే ఉండాలని కోరినట్లు చెబుతున్నారు. దీంతో.. తమకు పెట్టిన టార్గెట్లను రీచ్ కావటం కోసం ఆఫీసుల్లోనే నిద్రపోతున్నట్లు చెబుతున్నారు.

ఈ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాన్ మస్క్ తీరును తప్పు పడుతున్నారు. ఇక.. తాను ఆఫీసు నేల మీద పడుకున్న ఫోటో వైరల్ అయిన నేపథ్యంలో.. ఎస్తర్ స్పందించారు. తాము యూజర్లకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నంలో ఉన్నామని.. ఆ క్రమంలో కాసిన్ని త్యాగాలు తప్పవన్న ఆమె.. తన ఉద్యోగ జీవితంలో అత్యుత్తమ సమయంగా పేర్కొనటం గమనార్హం. చేసే పనిని ప్రేమించాలన్న ఆమె.. కొన్నిసార్లు అనుకున్న లక్ష్యాల్ని సాధించటం కోసం ఈ రీతిలో టైంను వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తంగా ట్విటర్ కొత్త యజమానిగా మారిన ఎలాన్ మస్క్ తీరుపై మాత్రం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.