Begin typing your search above and press return to search.

ఉద్యోగుల తొలగింపుపై ట్విట్టర్‌ ఫౌండర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   6 Nov 2022 11:30 PM GMT
ఉద్యోగుల తొలగింపుపై ట్విట్టర్‌ ఫౌండర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
X
ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ఫ్లాట్‌పామ్‌.. ట్విట్టర్‌ కొనుగోలుకు ఎలాన్‌ మస్క్‌ ఏ ముహూర్తంలో ముందుకొచ్చాడో కానీ దాన్ని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. కొనుగోలు ప్రక్రియే ముందుకు వెనక్కి అన్నట్టు సుదీర్ఘంగా సాగింది. ఇక ఎట్టకేలకు ట్విట్టర్‌ ఎలాన్‌ మస్క్‌ సొంతమైంది.

ఇక అంతా సాఫీగా సాగుతుందనుకునే లోపే మొత్తం ఉద్యోగుల్లో సగం ఉద్యోగులను, కీలక స్థానాల్లో ఉన్నవారిని తొలగిస్తూ ఎలాన్‌ మస్క్‌ షాకిస్తున్నారు.

ఈ వ్యవహారంపై ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌ డోర్సే ఆ సంస్థ ఉద్యోగులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. కంపెనీ ఉద్యోగులను దాదాపు సగానికి తగ్గిస్తూ ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న నిర్ణయాన్ని జాక్‌ డోర్సే తీవ్రంగా తప్పుబట్టారు.

ట్విట్టర్‌లో గతంలో పనిచేసిన ఉద్యోగులు, ప్రస్తుతం కొనసాగుతున్నవారు మానసికంగా దృఢంగా ఉంటారని జాక్‌ డోర్సే అభిప్రాయపడ్డారు. కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ వారంతా ఓ కొత్త మార్గాన్ని అన్వేషిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ను విక్రయించినందుకు చాలా మందికి తనపై కోపం ఉండటం సహజమేనన్నారు. వారంతా తనపై కోపం ఉన్నారన్న విషయం తనకు తెలుసని జాక్‌ డోర్సే బాంబుపేల్చారు

ఇప్పటికే ఉద్యోగంలో నుంచి తొలగింపుకు గురయినవారు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులకు పూర్తి బాధ్యత తనదేనని జాక్‌ డోర్సే తెలిపారు. అతి తక్కువ సమయంలోనే కంపెనీ సామర్థ్యాన్ని పెంచడమే తాను చేసిన తప్పు అని వాపోయారు. అందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేయడం గమనార్హం.

ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు (భారత కరెన్సీలో రూ.3,50,000 కోట్లకు) టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కంపెనీ తన చేతుల్లోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ట్విట్టర్‌ను సంపూర్ణ ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌ సీఈవోగా ఉన్న పరాగ్‌ అగర్వాల్, లా ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న గద్దె విజయను తొలగించారు. కొంతమందిని ఉద్యోగం నుంచి తొలగించారు. దాదాపు 7500 మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు కూడా అమలు చేస్తున్నారు.

కాగా ట్విట్టర్‌ బోర్డు నుంచి జాక్‌ డోర్సే గత మే నెలలో వైదొలిగిన సంగతి తెలిసిందే. 2006లో డోర్సే మరో ముగ్గురితో కలిసి ట్విట్టర్‌ను ఏర్పాటు చేశారు. 2015లో ఆయన ట్విట్టర్‌ సీఈవోగా నియమితులయ్యారు.