Begin typing your search above and press return to search.

'టీకా' కారణంగానే ఎక్కువ మరణాలు ... ప్రశాంత్‌ భూషణ్‌ కి షాకిచ్చిన ట్విటర్‌ !

By:  Tupaki Desk   |   29 Jun 2021 7:30 AM GMT
టీకా కారణంగానే ఎక్కువ మరణాలు ...  ప్రశాంత్‌ భూషణ్‌ కి షాకిచ్చిన ట్విటర్‌ !
X
కరోనా మహమ్మారి కట్టడికి మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ ను వేగంగా అందిస్తున్నాయి. మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ లను పరీక్షించకుండానే జనాలపై ప్రయోగిస్తున్నారని, యువతపై ప్రతికూల ప్రభావం పడుతోందని, అందుకే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ట్వీట్లు తీవ్రదుమారాన్ని రేపాయి. అలాగే, వ్యాక్సిన్‌ పనితీరుపై తనకు అనుమానాలు ఉన్నాయని, పొరపాటున కూడా వ్యాక్సిన్‌ తీసుకోబోనని ఆయన కామెంట్లు కూడా చేశాడు.

పదిరోజుల క్రితం వ్యాక్సిన్‌ తీసుకున్న 45ఏళ్ల మహిళ మరణించడం, ఆమె మృతికి వ్యాక్సిన్‌ కారణమని ఆమె భర్త ఆరోపించడం నేపథ్యంగా ఓ పేపర్‌ లో కథనం ప్రచారం అయ్యింది. ఆ కట్టింగ్‌ ను, వ్యాక్సిన్‌ పనితీరు వ్యర్థం అనే ఓ వెబ్‌ ఆర్టికల్‌ ను తన ట్విటర్‌ లో పోస్ట్‌ చేసిన ప్రశాంత్‌ భూషణ్‌.. యువత మీద, కరోనా నుంచి కోలుకున్న వాళ్ల మీద పరీక్షించకుండానే వ్యాక్సిన్‌ ను అందుబాటులోకి తెచ్చారంటూ విమర్శలకు దిగారు. కరోనాతో చనిపోయే అవకాశాలు మాత్రమే యువతకు ఉండేవని, కానీ, వ్యాక్సిన్‌ తో ఆ అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని అన్నారు. అయితే ,అసలే టీకామందులపై దేశంలో పలు చోట్ల ప్రజల్లో ఇంకా అనుమానాలు, అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఇలాంటి స్టేట్ మెంట్లు సరి కావని కరోనా వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డా. ఎన్.కె. అరోరా అన్నారు.

వ్యాక్సిన్‌ వికటించిన తొలి మరణం వివరాలను కూడా మేం ప్రజలకు అందుబాటులో ఉంచాం. అంతేకాదు డబ్ల్యూహెచ్‌ వో మార్గదర్శకాల ప్రకారం.. వ్యాక్సిన్‌ వికటించిన ఘటనలపై దర్యాప్తు కూడా జరిపిస్తున్నాం. ప్రజల్లో జ్వరాలు, నొప్పులు తప్పించి ప్రతికూల ప్రభావం చూపించిన కేసులు, సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐసీయూలో, చావు అంచున ఉన్నవాళ్లపై కూడా వ్యాక్సిన్‌ లు సానుకూల ప్రభావం చూపిస్తున్నాయి కదా. ఈ విషయాలేవీ ఆయనకు కనబడడం లేదా , ఎందుకు గుర్తించడం లేదు అని అరోరా ఘాటుగా స్పందించాడు. ఇక తప్పుడు సమాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్విటర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ వ్యవహారంలో స్పీడ్ గా స్పందించింది. ఆయన ట్వీట్లు తప్పుడు దారి పట్టించేవిగా ఉన్నాయని నోటిఫికేషన్‌ ఇచ్చింది. అంతేకాదు వ్యాక్సిన్‌ భద్రతపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నాయో చూడండని సూచించాయి.