Begin typing your search above and press return to search.

8 డాలర్ల ట్విటర్ బ్లూటిక్ తో ఓ కంపెనీకి ఒక్కరోజులో 1.22 లక్షల కోట్ల నష్టం

By:  Tupaki Desk   |   13 Nov 2022 7:51 AM GMT
8 డాలర్ల ట్విటర్ బ్లూటిక్ తో ఓ కంపెనీకి ఒక్కరోజులో 1.22 లక్షల కోట్ల నష్టం
X
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ ట్విటర్ ను ఎప్పుడైతే చేజిక్కించుకున్నాడో అప్పటి నుంచి కంపెనీని..దానిపై ఆధారపడ్డ కంపెనీలను నష్టాల్లోకి నెడుతున్నాడు. ఇటీవల ట్విటర్ బ్లూటిక్ కావాలంట నెలకు 8 డాలర్లు చెల్లించాలని కండీషన్ పెట్టాడు.దీంతో ఈ బ్లూటిక్ కోసం కొందరు అనైతికంగా అకౌంట్లు తీసి ఆ మొత్తం చెల్లించి బ్లూటిక్ పొందుతున్నారు. ఒరిజినల్ కంపెనీలను ఏమార్చి వాళ్లే అధికారికంగా గుర్తింపు పొంది కోట్ల నష్టాలకు కారణమైంది.

ఈ ట్విటర్ బ్లూ టిక్ కంపెనీకి తెచ్చిన నష్టం ఎంతో తెలుసా? దాదాపు 15 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.1.22 లక్షల కోట్లు.. అమెరికాకు చెందిన ఒక ఫార్మా కంపెనీకి ఒక ట్వీట్ తెచ్చిన నష్టం ఇది. ట్విటర్ లో డబ్బులు చెల్లించి ఇక ఎవరైనా బ్లూ టిక్ పొందేలా దాని కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఇటీవల కొత్త సదుపాయం తీసుకొచ్చారు.

సెలబ్రిటీలు, రాజకీయ నేతలు వంటి వారికి మాత్రమే ట్విటర్ బ్లూ టిక్ ఇచ్చేది. అదీ ఖాతాను వెరిఫై చేసిన తర్వాత మాత్రమే. బ్లూ టిక్ రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, జర్నలిస్టులు, ఇతర ప్రజా ప్రముఖులతో పాటు ప్రభుత్వ సంస్థలు, కంపెనీలకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత అందరికీ బ్లూ టిక్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇందుకు నెలకు 8 డాలర్లు చెల్లిస్తే చెల్లించాలి. దాంతో ఎవరైనా డబ్బులు చెల్లించి బ్లూటిక్ తీసుకునే వెసులుబాటు లభించింది. దీంతో ‘ఇలై లిల్లీ అండ్ కంపెనీ’ డూప్లికేట్ పేరుతో ఒకరు ట్విటర్ ఖాతాకు బ్లూటిక్ కొనుక్కున్నారు.

వాస్తవానికి ‘ఇలై లిల్లీ అండ్ కంపెనీ’ అనేది అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ. కానీ ఇదే పేరు మీద ట్విటర్ లో ఒకరు ఖాతా తెరిచారు. పైగా 8 డాలర్లు చెల్లించి దానికి బ్లూ టిక్ తెచ్చుకున్నారు. డయాబెటిస్ రోగులకు అవసరమైన ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను అమ్ముతూ ఉంటుంది. ఇలై లిల్లీ అండ్ కంపెనీ ట్విట్టర్ లో ఇదే పేరుతో తెరిచిన డూప్లికేట్ ఖాతా ఒక ట్వీట్ చేసింది. ఇకపై మేం అందరికీ ఉచితంగా ఇన్సులిన్ ఇస్తాం అనేది ఆ ట్వీట్ సారాంశం.

ఆ ట్వీట్ చేసిన తరవాత అసలు కంపెనీ ‘ఇలై లిల్లీ అండ్ కంపెనీ ’ షేర్లు పడిపోయాయి. శుక్రవారం షేరు ధర సుమారు 4.37 శాతం పడిపోయింది. 15 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయింది. ఇలా ఒక డూప్లికేట్ కాతా బ్లూ టిక్ కొనుక్కున్న ఫలితంగా ఒక కంపెనీకి రూ.లక్ష కోట్లకు పైగా నష్టం వచ్చింది. చివరకు ఆ కంపెనీ ట్విటర్ లో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఇలై లిల్లీ ఫార్మాకు 146 ఏళ్ల చరిత్ర ఉంది. అమెరికా సైన్యానికి చెందిన కల్నల్ ఇలై లిల్లీ 1876లో ఈ కంపెనీని ప్రారంభించారు. అమెరికాలోని ఇండియానా కేంద్రంగా సుమారు 120 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు సుమారు 37000 మంది ఉద్యోగులున్నారు. 1993లో ఇలై లిల్లీ భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించింది. 2016లో బెంగళూరులో ఔషధాల అభివృ్ధి కేంద్రం లిల్లీ కెపాబిలిటీ సెంటర్ ను ప్రారంభించింది.