Begin typing your search above and press return to search.

ఎలాన్ మ‌స్కుకు ట్విట్ట‌ర్ ఇచ్చిన షాక్ ఇదే!

By:  Tupaki Desk   |   11 July 2022 5:30 AM GMT
ఎలాన్ మ‌స్కుకు ట్విట్ట‌ర్ ఇచ్చిన షాక్ ఇదే!
X
44 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3.4౦ లక్షల కోట్లు)తో ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముందు అన్ని నిబంధనలకు ఓకే అని చెప్పిన మస్క్ ఆ తర్వాత ఫీచేముడ్ అంటూ ఫ్లేటు ఫిరాయించాడు.

ట్విట్టరులో అసలు ఖాతాలు కంటే నకిలీ ఖాతాలు (20 శాతం), స్పామ్ ఖాతాలే ఎక్కువగా ఉన్నాయని వీటి సంఖ్య ఎంతో ముందు తేల్చాలని ఎలాన్ మస్కు పట్టుబట్టిన సంగ‌తి తెలిసిందే. అలాగే మొత్తం ట్విట్టర్ అకౌంట్లలో యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా చాలా స్వల్పం (2.5 శాతం) అని మస్క్ చెబుతున్నారు. కాబట్టి ట్విట్టర్ లో స్పామ్ డేటా, ఫేక్ అకౌంట్ల గురించిన సమాచారం తనకు కావాలని అడుగుతున్నారు.

మరోవైపు ట్విట్టర్ యాజమాన్యం సమాచారం ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఇది ట్విట్టర్ గోప్యతా నియమాలు, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అలాగే ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకున్నా వినియోగదారులు రకరకాల కొత్త ఐడీలతో నకిలీ ఖాతాలు తెరుస్తూనే ఉంటారని వెల్లడించింది. ఎప్పటికప్పుడు ఫేక్ ఖాతాలను తొలగిస్తూనే ఉన్నామని.. ట్విట్టర్ అల్గారిథమ్, ఆటోమేటిక్ ప్రక్రియ ద్వారా నకిలీ ఖాతాలను ఏరివేస్తున్నామని వివరించింది. ట్విట్టర్ లో ఫేక్ ఖాతాలు కేవలం 5 శాతమేనని.. మస్క్ అంటున్నట్టు 20 శాతం లేవని చెబుతోంది.

ఈ నేప‌థ్యంలో ట్విట్టర్‌తో కుదుర్చుకున్న 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఏప్రిల్‌లో ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కుదిరింది. అయితే దీన్ని మేలో హోల్డ్‌లో ఉంచినట్లు ఎలన్ మస్క్ ప్రకటించాడు. తాజాగా ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు.

దీంతో ఎలన్ మస్క్‌పై ట్విట్టర్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయ సేవా సంస్థ అయిన 'వాటెల్, లిప్టన్, రోసెన్ అండ్ కాట్జ్ ఎల్ఎల్‌పీ' అనే సంస్థతో ట్విట్ట‌ర్ ఒప్పందం కుదుర్చుకుంది.

ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కచ్చితంగా కొనుగోలు చేయడమో లేకపోతే పరిహారం చెల్లించడమో చేయాల‌ని ట్విట్టర్ కోర్టును ఆశ్రయించనుంది. జూలై మూడో వారంలో దీనిపై కోర్టులో కేసు నమోదు చేయాలని ట్విట్టర్ నిర్ణయించింది.

కాగా మ‌రోవైపు ఎలన్ మస్క్ తరఫున క్విన్ ఎమాన్యుయెల్ ఉర్కాహార్ట్ అండ్ సల్లివాన్ అనే న్యాయ సంస్థ వాదించ‌నుంది. ఎలన్ మస్క్ తన కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకోవడంపై ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టైలర్ స్పందించారు. నిర్ణయించిన ధరకు ట్విట్టర్ ఒప్పందాన్ని ముగించేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మస్క్ నిర్ణయంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు.