Begin typing your search above and press return to search.

ఏపీ మాజీ సీఎస్‌, రాయ‌ల‌సీమ ఫోరం నేత మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్‌!

By:  Tupaki Desk   |   19 Sep 2022 7:30 AM GMT
ఏపీ మాజీ సీఎస్‌, రాయ‌ల‌సీమ ఫోరం నేత మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్‌!
X
అమరావతి వ్యవహారంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలను ప్ర‌స్తుతం కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఒకే ఒకే రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌ని కోరుతూ రాజ‌ధాని రైతులు అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు అంటూ పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ యాత్ర ప్ర‌స్తుతం బాప‌ట్ల జిల్లా రేప‌ల్లె చేరుకుంది. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తెచ్చిన మూడు రాజ‌ధానుల చ‌ట్టాన్ని కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

ఒక్క వైఎస్సార్సీపీ మిన‌హాయించి అన్ని పార్టీలు అమ‌రావ‌తికే మ‌ద్ద‌తు ప‌లుకుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఒక్క వైఎస్సార్సీపీ మాత్ర‌మే మూడు రాజ‌ధానులు కావాల‌ని కోరుతోంది. దీనికి అనుకూలంగా , వ్య‌తిరేకంగా మాట్లాడేవారితో ఏపీ రాజ‌కీయాలు హీటెక్కాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయి.

మ‌రోవైపు సోష‌ల్ మీడియా కూడా హీటెక్కింది. సోష‌ల్ మీడియాలోనూ నేత‌లు ట్వీట్ల వార్ చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు, రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం నేత పురుషోత్తంరెడ్డి మ‌ధ్య ట్వీట్ల వార్ జ‌రిగింది. ఆదివారం ఒక ప‌త్రిక ఎడిటోరియ‌ల్‌లో వ‌చ్చిన క్లిప్పును ఐవైఆర్ కృష్ణారావు ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

ఐవైఆర్ కృష్ణారావు పోస్టు చేసిన ప‌త్రిక‌ క్లిప్పు ప్ర‌కారం.. ''కేవ‌లం ఐదేళ్ల‌లోనే వేల కోట్ల రూపాయ‌ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోగ‌లిగిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా అమ‌రావ‌తిని నిర్మించ‌లేరా? అది కూడా రైతులు అప్ప‌నంగా ఇచ్చిన 35 వేల ఎక‌రాల‌ను చేతిలో పెట్టుకుని ల‌క్ష కోట్ల‌తో రాజ‌ధానిని నిర్మించ‌లేరా? న‌రేంద్ర మోడీ చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో ఎడాపెడా అప్పులు తెచ్చి బ‌ట‌న్లు నొక్కుతున్న జ‌గ‌న్ అమ‌రావ‌తి కోసం ఆ చేత్తో అప్పు చేయ‌లేరా?" అని ఆ ప‌త్రిక త‌న ఎడిటోరియ‌ల్‌లో జ‌గ‌న్ తీరును దుయ్య‌బ‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

ఆ ప‌త్రిక క్లిప్పును పోస్టు చేసిన ఐవైఆర్ కృష్ణారావు దాని కింద త‌న ట్వీట్‌లో 'పిచ్చి ప్రశ్న. తన ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడం కోసంగా రాష్ట్రాన్ని దివాలా బాట పట్టించైనా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తారు కానీ మీ పెట్టుబడులకు విలువ పెంచే విధంగా అప్పులు చేసి ఖర్చు ఎందుకు చేస్తారు' అంటూ మాజీ సీఎస్ ఐవైఆర్ త‌న ట్వీట్ లో ఎద్దేవా చేశారు.

ఐవైఆర్ కృష్ణారావుకు ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం నేత పురుషోత్తంరెడ్డి..''మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ గారు ప్రశ్నించింది ఆర్కే గారినే అయినా సమాధానం మాత్రం ఏపీ బీజేపీ నేతలు చెప్పాలి. జగన్ సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తారు గాని మీ పెట్టుబడులకు విలువ పెంచడానికి కాదన్నారు. రాజధానిలో పెట్టుబడులు ఎవరివి ? అలాంటి ఉద్యమానికి బీజేపీ ఎందుకు మద్దతుగా నిలుస్తోంది?'' అని త‌న ట్వీట్లో నిల‌దీశారు.

పురుషోత్తంరెడ్డి ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ... ''విషయాన్ని వక్రీకరించడంలో పురుషోత్తమ రెడ్డి గారు తన తెలివిని చూపిస్తున్నారు. నా ట్వీట్ అమరావతి రాజధాని అంశం కాదు. అమరావతి మహానగరం అంశం. దానికి లక్ష కోట్లు కావాలి. అది పెట్టాల్సిన అవసరం లేదు.

ఇక జగన్ గారి విషయానికొస్తే కేవలం ఓటు బ్యాంకుల కోసం రాష్ట్రాన్ని దివాలా తీస్తున్న విధానం అందరికీ తెలిసిందే. చేతనైతే పన్నులు పెంచి పంచాలి. అప్పులు చేసి పంచటం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే'' అంటూ త‌న ట్వీటులో ఘాటుగా స్పందించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.